ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చాక నెల రోజులు కూడా కాకుండానే టీడీపీకి షాక్ ఇచ్చి బీజేపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి సుజ‌నా చౌద‌రి ఆదివారం ఏపీకి వ‌చ్చిన తొలి రోజే బాబుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఈ క్ర‌మంలోనే ఏపీని అభివృద్ధి పథంలో నడపడంలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తుందని ఆయ‌న అన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి చెయ్యని విధంగా కేంద్రం ఏపీకి సాయం చేసిందని తెలిపారు. కానీ దానిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమైందని చెప్పారు. 


ఇక బీజేపీలో చేరిన సంద‌ర్భంగా ఏపీకి తొలిసారిగా వ‌చ్చిన సుజ‌నాకు స్వాగ‌తం ప‌లుకుతూ కొంద‌రు విజ‌య‌వాడ‌లో బ్యాన‌ర్లు ఏర్పాటు చేశారు. ఈ బ్యానర్ల‌లో మోడీ, ఎన్టీఆర్ ఫొటోలు కూడా పెట్టారు. ఇది పెద్ద ర‌చ్చ‌కు దారితీసింది. దీనిపై మాట్లాడిన సుజ‌నా బాబుకు ప‌రోక్షంగా పంచ్ విసిరారు. తన ఫ్లెక్సీల్లో ఎన్టీఆర్‌ ఫొటో ఎవరు పెట్టారో తెలియదని... ఫ్లెక్సీల్లో ఎన్టీఆర్‌ ఫొటో పెట్టడంలో తప్పేముందని ప్రశ్నించారు. 


సుజ‌నా వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి ఎన్టీఆర్ ఏ ఒక్క‌ళ్ల‌కో చెందిన వ్య‌క్తి కాద‌ని... ఆయ‌న చంద్ర‌బాబు సొత్తేం కాద‌న్న‌ట్టు చుర‌క‌లు అంటించారు. రాజ్యాంగం ప్రకారమే తాను టీడీపీని వీడి బీజేపీలో చేరానని స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంపై ఇప్పుడే ఆరోపణలు చేయడం సరైన పద్దతి కాదన్నారు. ఇక గ‌తంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య స‌ఖ్య‌త లేకే ఏపీ అభివృద్ది చెందలేద‌ని అన్నారు.


ఇదే క్ర‌మంలో ఏపీలో గత ఐదేళ్ల పాలన అంశాలపై త్వరలోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. అంటే చంద్ర‌బాబు పాల‌న‌లో జ‌రిగిన వ్య‌వ‌హారాల‌న్నింటిపైనా బీజేపీ అధిష్టానం నిఘా పెట్టింద‌ని... ఈ బండారం అంతా త్వ‌ర‌లోనే బ‌య‌ట‌కు రానుంద‌ని కూడా సుజ‌నా వ్యాఖ్య‌లు స్ప‌ష్టం చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: