పత్రికను ప్రింటింగుకు పంపించాల్సిన చివరి గడువునే డెడ్‌లైన్‌ అంటారు. రాత్రి 9 గంటలకల్లా బిజినెస్‌, సినిమా, ఫీచర్‌ పేజీలు రెడీ చేసుకుంటారు. ఫస్ట్‌ పేజీ, దాని తరువాయి పేజీలను అట్టే పెట్టుకొని లేటెస్ట్‌ వార్తల కోసం టీవీ ఛానల్స్‌ స్క్రోలింగ్‌ వైపు చూస్తుంటారు.

అది కూడా 12 వరకు చూసి , ప్రింటింగ్‌కి పంపేస్తారు కానీ, చంద్రయాన్‌ వంటి ప్రయోగాలు జరుగుతున్నపుడు, న్యూస్‌ డెస్క్‌, అర్థరాత్రి రాత్రి 2, 3 గంటలు వరకు అలర్ట్‌గా ఉండాలి. పైన ఇచ్చిన ఈ రోజు 'వార్త' క్లిప్పింగు చదివారు కదా ... డెస్క్‌ జర్నలిస్టులు అలర్ట్‌గా లేకపోతే, 'వార్త' డైలీ లాగా చంద్రయాన్‌-2ను ప్రయోగించేసి, రాష్ట్రపతి వీక్షించాడనీ రాసేసుకొని, రాష్ట్రపతితో చప్పట్లు కూడా కొట్టించేస్తుంది. తెల్లవారుజామున 3 గంటలకు కదా ప్రయోగం ఎలాగూ జరిగిపోతుందిలే, జరిగినట్టు రాసేస్తే పోలా అనుకున్నది ఆ పత్రిక. కానీ సీన్‌ రివర్స్‌ అయింది.

అసలు లేటెస్ట్‌ న్యూస్‌ ఏంటంటే...? మూడు గంటలకు ప్రయోగించాల్సిన రాకెట్లలో కొన్ని టెక్నికల్‌ సమస్యలు తలెత్తి, రెండు గంటల ప్రాంతంలో ఆపేశారు. ప్రత్యక్ష ప్రసారం నిలిపివేశారు. కాసేపటికి, రెండున్నర గంటల సమయంలో ఇస్రో అధికారికంగానే వాయిదాను ప్రకటించింది.

డెడ్లీ అవర్స్‌లో, ఏదైనా ఫ్లాష్‌ న్యూస్‌ వస్తే..? అవసరమైతే అప్పటికప్పుడు ప్రింటింగును అన్ని యూనిట్లలో ఆపివేసి, ఆ వార్తను అప్‌డేట్‌ చేసి ప్రింట్‌కి ఇచ్చే ప్రొఫెషనలిజం ఉన్న సబెడిటర్లు కూడా లేకపోలేదు. అందుకే 'ఈనాడు', 'సాక్షి'లో చంద్రయాన్‌ వాయిదా పడిందని... ఫ్లాష్‌ న్యూస్‌గా ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: