క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. టిడిపి సీనియయర్ నేత రాయపాటి సాంబశివరావు తొందరలో టిడిపికి రాజీనామా చేయటం ఖాయంగా తెలుస్తోంది. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలుగు రాష్ట్రాల ఇన్చార్జి రామ్ మాధవ్ తో రాయపాటి భేటీ అవటమే ఇందుకు నిదర్శనం.

 

వీలైనంతమంది టిడిపి నేతలను తమ పార్టీలోకి చేర్చుకోవాలన్న ప్లాన్ తో బిజెపి అగ్ర నేతలు పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే గుంటూరులోని రాయపాటి ఇంటికి రామ్ మాధవ్ వెళ్ళి దాదాపు గంటకుపైగా భేటీ అయ్యారు. సరే రాజకీయాలు వ్యాపారమైన నేపధ్యంలో తనకు అనుకూలమైన ప్యాకేజీ విషయాన్ని రాయపాటి ప్రస్తావించారని సమాచారం.

 

రాయపాటికి ట్రాన్స్ ట్రాయ్ అనే కాంట్రాక్టు సంస్ధ ఉంది. ప్రస్తుతం అది నష్టాల్లో ఉంది. కాబట్టి నష్టాల్లో నుండి గట్టెక్కటానికి అవసరమైన  కాంట్రాక్టులు ఇవ్వాలని, కొన్ని కాంట్రాక్టుల విషయం కేసులు కూడా ఉన్నాయని సమాచారం. రాబోయే ఎన్నికల్లో తన కొడుకు రంగబాబుకు టికెట్ లాంటి అనేక ప్యాకేజీలను రాయపాటి ప్రస్తావించారట.

 

చంద్రబాబును దెబ్బకొట్టి ఎలాగైనా రాష్ట్రంలో బలపడాలన్న ఉద్దేశ్యంతో ఉన్న బిజెపి కూడా రాయపాటి డిమాండ్లకు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఎందుకంటే రాయపాటి చేరికవల్ల గుంటూరులో బిజెపి ఎంతో కొంత బలోపేతమవుతున్నది వాస్తవం. రామ్ మాధవ్ తో తన భేటీని చంద్రబాబుతో కూడా రాయపాటి చెప్పారట. అంటే చంద్రబాబు ఆమోదంతోనే రాయపాటి బిజెపిలోకి చేరుతున్నారనే అనుకోవాలి. మొత్తం మీద చంద్రబాబు బిజెపి ఎదుగుదలకు పరోక్షంగా సాయం చేస్తున్నారనే అనుకోవాలి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: