అసెంబ్లీలో సమావేశాలు జరుగుతుంటే.. అక్కడి శబ్దాలకు ఇతరులు లోనికి ప్రవేశించేందుకు భయపడుతుంటారు.  మూగజీవాలు లోపలికి వస్తాయా చెప్పండి.  అవి రావాలంటే మామూలు విషయం కాదు.  వందలాది మంది సభలో ఉండగా ఏదైనా ఒక ప్రాణి లోనికి ప్రవేశిస్తే...  ప్రాణి అంటే ఏదో దోమా బొద్దింక అనుకునేరు..అవి కాదు.. 


విషసర్పం అసెంబ్లీలోకి వస్తే ఎలా ఉంటుంది.  ఇంకేముంది.. పంచెలు పైకి ఎగ్గట్టి పరుగులు తీయడమే.  అయినా అసెంబ్లీలోకి పాములు ఎందుకు వస్తాయి చెప్పండి.  నిత్యం చాలా శుభ్రంగా అసెంబ్లీని  ఉంచుతారు కదా.  ఈ పాము వచ్చింది మన దగ్గర కాదు.. నైజీరియాలోని ఒండొ రాష్ట్ర అసెంబ్లీలో..  


ఆఫ్రికా ఖండంలో పేద దేశాల్లో నైజీరియా కూడా ఒకటి.  ఆ రాష్ట్రంలోని ఒండొ అసెంబ్లీ శిధిలావస్థలో ఉన్నది.  ఆ  అసెంబ్లీలోనే  సభలు  నిర్వహిస్తున్నారు.   శిథిలమైన సీలింగ్‌ నుంచి పెద్ద సర్పం కింద పడడంతో సభలో ఉన్న ప్రజా ప్రతినిధులంతా భయంతో పరుగులు పెట్టారు. అదృష్టవశాత్తు ఆ పాము ఎవరినీ కాటు వేయలేదని ఓ ప్రజాప్రతినిధికి చెందిన అధికార ప్రతినిధి వెల్లడించారు. 


వెంటనే అప్రమత్తమైన అసెంబ్లీ సిబ్బంది సర్పం ఎవరికీ హాని తలపెట్టకుండా ఉండాలనే ఉద్దేశంతో చంపేశారని వివరించారు. ఈ ఘటనతో పైకప్పు బాగు చేసే వరకూ సభను నిరవధిక వాయిదా వేశారు. అసెంబ్లీ భవనాన్ని పునరుద్ధరించేందుకు కూడా సరిపడా నిధులు లేని స్థితి ఉందని, ఇప్పటికే దీని నిర్వహణ వ్యయం కూడా భరించలేని స్థితిలో ఉందని చెప్పారు. 

అయినప్పటికీ తప్పని సరి పరిస్థితుల్లో అసెంబ్లీని నిర్వహించాల్సి వస్తోందని, ప్రభుత్వానికి నిధులు ఇవ్వమని కోరుతున్నా పట్టించుకోవడం లేదని ప్రభుత్వాధికారులు అంటున్నారు. కేంద్రంలో ఉన్న  ప్రభుత్వం పట్టనట్టుగా  వ్యవహరిస్తోదని వాపోతున్నారు.  కొన్ని రోజులు ఇలాగే జరిగితే.. అసెంబ్లీ భవనం కూలిపోయే స్థితికి వస్తుందని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: