నేడు ప్ర‌పంచ అంతా కూడా ఓ కుగ్రామంగా మారిపోయింది. మీడియా విస్తృతంగా పెరిగిపోవ‌డం, సోష‌ల్ మీడియా మ‌రిం తగా పెరిగిపోయిన నేప‌థ్యంలో ఒకరి అభిప్రాయాలు ఒక‌రు క్ష‌ణాల్లో పంచుకోవ‌డం, ఒక ప్రాంతానికి సంబంధించిన వార్తలు కొన్ని సెక‌న్ల‌లోనే ప్ర‌పంచానికి చేరువ కావ‌డంతో ఇప్పుడు ప్ర‌పంచ‌మే ఓ కుగ్రామంగా మారిపోయింది. ఈ మొత్తానికి సోష‌ల్ మాధ్య‌మాలు కీల‌క పాత్ర పోషిస్తున్నాయి. అభిప్రాయాల వేదిక‌ల నుంచి విమ‌ర్శ‌ల అస్త్రాల‌ను సంధించుకునే వేదిక‌ల వ‌రకు, స‌మ‌స్య‌లపై ఫిర్యాదుల నుంచి వాటి ప‌రిష్కారాల వ‌ర‌కు కూడా సోష‌ల్ మీడియా నేడు కీల‌క పాత్ర పోషిస్తోంది. 


అధునాత‌న సోష‌ల్ మీడియా మాధ్య‌మాలు అందుబాటులోకి రావ‌డంతో ప్ర‌తి ఒక్క‌రూ త‌మ స‌మ‌స్య‌ల‌ను వేలి కొస‌ల సా యంతోనే ప‌రిష్క‌రించుకుంటున్న ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇలాంటి కీల‌క‌మైన మాధ్య‌మాల్లో ప్ర‌స్తుతం ప్ర‌పంచా నికి చేరువ అయింది ట్విట్ట‌ర్‌. ఈ ట్విట్ట‌ర్ వేదిక‌గా రాజ‌కీయ నేత‌ల నుంచి ప్ర‌భుత్వ యంత్రాంగాల వ‌ర‌కు కూడా ప్ర‌జ‌లకు చేరువ అవుతున్నాయి. ప్ర‌తి విష‌యంపైనా ట్విట్ట‌ర్ వేదిక‌గా అనేక చ‌ర్చ‌లు కూడా జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో మ‌న దేశంలో అనేక న‌గ‌ర‌పాల‌క సంస్థ‌లు ప్ర‌జ‌ల‌కు మ‌రింత మెరుగైన పాల‌న‌ను అందించేందుకు ట్విట్ట‌ర్‌ను వాడుకుంటున్నాయి. 


ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు, వారి నుంచి ఫిర్యాదులు స్వీక‌రించేందుకు కూడా ముందుకు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో ముంబై, చెన్నై, ఢిల్లీ వంటి కీల‌క న‌గ‌ర పాల‌క సంస్థ‌లు ట్విట్ట‌ర్ వేదిక‌గా నిత్యం ప్ర‌జ‌ల‌ను ప‌ల‌క రిస్తున్నాయి. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్‌లోని బ‌ల్దియా కూడా ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తోంది. దీంతో ప్ర‌జ‌లు వివిధ స‌మ‌స్య‌ల‌ను ఈ ట్విట్ట‌ర్ ద్వారా నేరుగా అధికారుల దృష్టికి తెచ్చి వాటికి ప‌రిష్కారాల‌ను పొందు తున్నారు. ముఖ్యంగా గ‌తంలో మంత్రిగా ప‌నిచేసిన ప్ర‌స్తుత అధికార పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌.. సోష‌ల్ మాధ్యమాన్ని వేదిక‌గా చేసుకుని ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యారు. ఈ క్ర‌మంలోనే బ‌ల్దియా ట్విట్ట‌ర్‌కు అనూహ్యంగా ఫాలోవ‌ర్లు పెరిగిపోయారు. 


ఒక్క‌మాట‌లో చెప్పాలంటే.. దేశంలో ఏ మునిసిపల్‌ కార్పొరేషన్‌కూ లేని స్థాయిలో బల్దియా ఖాతాకు ఫాలోవర్లున్నారని సంస్థ వర్గాలు తెలిపాయి. అహ్మదాబాద్‌ కార్పొరేషన్‌ను 40,100 మంది, బెంగళూరు కార్పొరేషన్‌ను ట్విటర్‌లో 26800, పుణే 21,400 మంది ఫాలో అవుతున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో అగ్రస్థానంలో నిలిచిన సూరత్‌ కార్పొరేషన్‌ ట్విటర్‌ ఖాతాను కేవలం 4,100 మంది ఫాలో అవుతున్నారు. గ్రేటర్‌ విశాఖ, విజయవాడ, వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్ల ఖాతాను 4 వేల మంది లోపే ఫాలో అవుతున్నారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ పేరిట ఉన్న ట్విటర్‌ ఖాతానూ 55,400 మంది ఫాలో అవుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇంత రికార్డు సొంతం చేసుకోవ‌డం వెనుక ఖ‌చ్చితంగా కేటీఆర్ కృషి ఉంద‌ని అంటున్నారు అధికారులు.


మరింత సమాచారం తెలుసుకోండి: