తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధ్య‌క్షుడు కేసీఆర్‌పై స‌హ‌జంగా విప‌క్షాలు చేసే ఆరోప‌ణ‌...రాష్ట్రాన్ని అప్పుల కుప్ప‌గా మార్చేశార‌ని దుయ్య‌బ‌ట్ట‌డం. అప్పుల విష‌యంలో కేసీఆర్‌కు ముందు...కేసీఆర్‌కు త‌ర్వాత అన్న‌ట్లుగా..ప‌రిస్థితి మారింద‌ని ప్ర‌తిప‌క్షాలు ప్ర‌ధానంగా ఆరోపిస్తుంటాయి. తాజాగా రాష్ట్ర స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానంలోనూ ఇదే అంశం ప్ర‌స్తావ‌న‌కు రాగా, హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. అప్పులు ఉన్నంతమాత్రాన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను నిలిపివేయాలనడం సరికాదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. పిటిషనర్లు తమకు తాము నిజాం రాజులా, భవనాల యజమానుల్లా భావించవద్దని చురకలంటించింది. ఇదంతా కొత్త అసెంబ్లీ, సెక్ర‌టేరియ‌ట్ విష‌యంలో జ‌రిగింది.


ఎర్రమంజిల్‌లో నూతన అసెంబ్లీ భవన సముదాయం నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో వాదనలు జరిగాయి.  ఎర్రమంజిల్ నూతన అసెంబ్లీ భవన సముదాయం నిర్మాణానికి సంబంధించిన ప్రభుత్వ వాదనలపై గురువారం పిటిషనర్ల తరఫు న్యాయవాదులు నళిన్‌కుమార్, చిక్కుడు ప్రభాకర్, రచనారెడ్డి వేర్వేరుగా వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి రూ.లక్ష కోట్లకుపైగా అప్పులున్నాయని, అప్పులను పట్టించుకోకుండా ప్రజాధనాన్ని వృథాచేస్తూ నూతన భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్నారన్న పిటిషనర్ల వాదనలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. దేశానికి ఉన్న అప్పు ఎంత? అప్పున్నదని ప్రజాసంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను నిలిపేయాలని కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించగలమా అని పిటిషనర్లను నిలదీసింది. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు ఉన్నాయని అంటే, అభివృద్ధి వద్దని ఎలా చెప్పగలమని చీఫ్ జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ షమీమ్‌అక్తర్‌ల నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.


ఈ సందర్భంగా ప్రస్తుత అసెంబ్లీ పాతభవనాల్లో సౌకర్యాలు లేకపోవడంతోపాటు ప్రమాదకరంగా ఉన్నాయని ప్రభుత్వం చెప్తున్నదని ధర్మాసనం పేర్కొంది. ఎక్కడ ఏ భవనం నిర్మిస్తారనే ప్లాన్ లేకుండానే ఎర్రమంజిల్‌ను ఎలా ఎంపికచేశారని పిటిషనర్ల తరపు న్యాయవాదులు ప్రశ్నించారు. మేం కూడా జ్యుడీషియల్ అకాడమీ కోసం ప్రభుత్వాన్ని 20 ఎకరాల స్థలం అడిగాం.. స్థలం కేటాయించాకే ఎక్కడ ఏ భవనాలు నిర్మించాలనే నిర్ణయం జరుగుతుందని ఓ ఉదాహరణగా హైకోర్టు పేర్కొంది. ప్రస్తుతం అసెంబ్లీ ఉన్న స్థలంతోపాటు అందులోని నర్సరీని కలుపుకొన్నా 18 ఎకరాలకు మించిలేదని, నూతన అసెంబ్లీ నిర్మాణానికి 25 ఎకరాలు కావాలని కోర్టు ఎదుట హాజరైన ఆర్‌అండ్‌బీ ఈఎన్సీ గణపతిరెడ్డి ఇప్పటికే ప్రాథమిక సమాచారమే అందజేశారని ధర్మాసనం గుర్తుచేసింది. 


ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలను కోర్టులు నిలిపేయవచ్చనే పిటిషనర్ల వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ..ప్రభుత్వాలు తీసుకొనే విధాన నిర్ణయాల్లో తప్పులు నిర్ణయించడానికి కోర్టులు అప్పిలేట్ అథారిటీలు కావని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. నిర్ణయ ప్రక్రియ చట్టబద్ధమా? కాదా? నిర్ణయం తీసుకున్న విధానంలో చట్టబద్ధమైన లేదా రాజ్యాంగబద్ధమైన లోపాలు ఉన్నాయా? అని మాత్రమే పరిశీలించగలం అని స్పష్టంచేసింది. పిటిషనర్ల వాదనలపై అభ్యంతర వ్యక్తంచేసిన హైకోర్టు.. తమకుతాము నిజాం రాజులా, భవనం యజమానుల్లా పిటిషనర్లు భావించవద్దని చురకలు అంటించింది. ప్రజాప్రయోజనం దృష్టిలోనే వాదనలు చేయాలని సూచించింది. ప్రభుత్వ వాదనలకు సవరణగా రెండోసారి వాదిస్తున్నప్పుడు సూటిగా, స్పష్టంగా ఉండాలని.. మొదట సారి వాదనలను పునరావృతం చేస్తే సమయం వృథా అవుతున్నదని పేర్కొంది. విషయానికి సంబంధం లేని అంశాలపై వాదనలు చేస్తున్న న్యాయవాదిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: