సుదీర్ఘ‌కాలం దేశాన్ని ప‌రిపాలించిన కాంగ్రెస్ పార్టీలో ఊహించ‌ని అస్పష్ట‌త క‌నిపిస్తోంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిని తేల్చుకోలేక‌పోతోంది. కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం ముగిసింది. అధ్యక్షుని ఎంపిక కోసం సీడబ్ల్యూసీ ఐదు కమిటీలుగా విడిపోయింది. అయితే ఈ కమిటీల్లో సోనియా, రాహుల్‌ గాంధీ పేర్లను చేర్చడంపై వారు అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. తమ పేర్లను అధ్యక్ష ఎంపిక కమిటీల్లో చేర్చడంపై అసంతృప్తి వ్యక్తంచేసిన సోనియా, రాహల్‌ లు సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. అధ్యక్షుడిగా ఉండేందుకు తమకు ఆసక్తి లేదని, అధ్యక్షున్ని ఎన్నిక పారదర్శకంగా జరగాలని స్పష్టంచేశారు.


పార్లమెంట్ సభ్యులు, పీసీసీ అధ్యక్షులతో కలిసి ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. ఐదు గ్రూపుల్లో వివిధ ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలు ఉంటారు. పలు అంశాలపై ఈ బృందాలు సుధీర్ఘంగా చర్చించి అధ్యక్షుడి పేరును ఏకగ్రీవంగా ప్రతిపాదించాల్సి ఉంటుంది. మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్‌కు తాత్కాలిక బాధ్యతలు అప్పగిస్తారని వినిపిస్తోంది. పార్టీ సంస్థాగత ఎన్నికలు జరిగే వరకు ఆయన్ను అధ్యక్షుడిగా నియమించాలని చర్చ జరుగుతోంది. మరోవైపు కర్ణాటకు చెందిన మల్లికార్జున ఖర్గే కూడా అధ్యక్ష పదవికి రేసులో ఉన్నట్లు సమాచారం. యువ  నేతలైన  జ్యోతిరాదిత్య,  సచిన్  పైలెట్  పేర్లూ  తెరపైకి  వచ్చాయి.  సంప్రదింపుల  ద్వారా కాంగ్రెస్  అధ్యక్ష  పదవికి  ఎవరు  సరిపోతారో  నిర్ధారించనున్నారు.  పార్టీలో  అంతర్గతంగా  ఎన్నికలు  నిర్వహిస్తే… నాయకులు  రెండు  వర్గాలుగా  విడిపోయే  ప్రమాదం  ఉందని  కొందరు  నేతలు  సూచించడంతో  సంప్రదింపులతోనే తేల్చేయాలని  నిర్ణయించారు. 


కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో పాల్గొనేందుకు యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, రణదీప్ సూర్జేవాలా, కేసీ వేణుగోపాల్, హరీశ్ రావత్, మీరా కుమార్, అహ్మద్ పటేల్ తదితరులు సమావేశానికి హాజరయ్యారు. పీసీసీ చీఫ్‌లు, ఎంపీలు, సీఎల్పీ నాయకులు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శలు సమావేశంలో పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: