బ‌ల‌మైన రాజ‌కీయ వార‌సత్వం ఆమె సొంతం. త‌ల్లి, తండ్రి, తాత ఇచ్చిన రాజకీయ వారసత్వాన్ని అందుకున్న ఆమె ఎలాంటి రాజ‌కీయ అనుభ‌వం లేక‌పోయినా పోటీ లేకుండా ఎమ్మెల్యే అయిపోయింది. చివ‌ర‌కు ఎమ్మెల్యే అయిన రెండున్న‌రేళ్ల‌కే మంత్రి అయ్యింది. మ‌రో రెండేళ్ల‌కే మంత్రి హోదాలో క‌నీసం ఎమ్మెల్యేగా కూడా గెల‌వ‌లేని ప‌రిస్థితికి ప‌డిపోయింది. ఇదంతా మాజీ మంత్రి భూమా అఖిల‌ప్రియ గురించే. మంత్రి హోదాలో ఉండి తాజా ఎన్నిక‌ల్లో పోటీ చేసిన‌  భూమా అఖిలప్రియ దారుణంగా ఓటమిపాలయ్యారు. 


అఖిల ఎమ్మెల్యేగా ఓడిపోవ‌డానికి చాలా కార‌ణాలే ఉన్నాయి. పార్టీ మార‌డం, స్థానిక రాజ‌కీయాలు, భ‌ర్త పెత్త‌నం ఎక్కువ అవ్వ‌డం, ఆమె వ్య‌వ‌హార శైలీ, భూమా అనుచ‌రుల‌ను ప‌క్క‌న పెట్ట‌డం ఇలా అన్ని క‌లిసి ఆమెను ఓడించాయి. ఎన్నికల ఫలితాల అనంతరం భూమా కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. భూమా కుటుంబం నుంచి కిషోర్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరిపోయారు. ఇక క‌ర్నూలు పొలిటిక‌ల్ టాక్ ప్ర‌కారం భూమా అఖిల‌ప్రియ రెండో వివాహం చేసుకున్న‌ప్ప‌టి నుంచే ఆ ఫ్యామిలీలో గ్యాప్ వ‌చ్చింద‌నే వారు కూడా ఉన్నారు.


అఖిల బంధువుల‌కు ఆమె భ‌ర్త వ్య‌వ‌హార శైలీ న‌చ్చ‌క‌పోవ‌డంతో వారంతా ఆమెకు దూర‌మ‌య్యార‌ని తెలుస్తోంది. అంతెందుకు ఆమెకు స్వ‌యానా మేన‌మామ, క‌ర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ.మోహ‌న్‌రెడ్డిని సైతం వాళ్లు ప‌క్క‌న పెట్టారు. అందుకే ఆయ‌న ఎన్నిక‌ల‌కు ముందు తిరిగి వైసీపీలోకి వెళ్లిపోయారు. ఈ క్ర‌మంలోనే ఆమె స‌రికొత్త ఎత్తుగ‌డ‌ల ద్వారా మ‌ళ్లీ రాజ‌కీయంగా భూమా ఫ్యామిలీని వెలుగులోకి తెచ్చే ప్ర‌య‌త్నాలు కూడా ప్రారంభించారు. భూమా ఫ్యామిలీ రాజ‌కీయ వార‌సుడిగా తన సోదరుడు విఖ్యాత్ రెడ్డిని ప్రకటించారు. 


ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో విఖ్యాత్‌రెడ్డే ఆళ్ల‌గ‌డ్డ నుంచి పోటీ చేస్తార‌ని కూడా అక్క‌డ చ‌ర్చించుకుంటున్నారు. ఇక అఖిల‌కు ఆళ్ల‌గ‌డ్డ బాధ్య‌త‌లు త‌న సోద‌రుడికి అప్ప‌గించి... తాను నంద్యాల‌కు షిఫ్ట్ అయితే బాగుంటుంద‌న్న ఆలోచ‌న‌ల ఉన్నా అక్క‌డ త‌న కజిన్ అయిన మాజీ ఎమ్మెల్యే భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి పాతుకుపోయారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఆయ‌న్ను త‌ప్పించ‌డం కూడా క‌ష్ట‌మే. నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో గెలిచిన బ్రహ్మానందరెడ్డి ఇటీవల జరిగిన ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. పైగా బ్రహ్మానందరెడ్డితోనూ అఖిలప్రియ కు కొంత గ్యాప్ వచ్చిందంటున్నారు.


ఇప్పుడున్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఇటు విఖ్యాత్‌రెడ్డి భూమా ఫ్యామిలీ వార‌సుడిగా ఎంట్రీ ఇవ్వ‌డం, అటు బ్ర‌హ్మానంద‌రెడ్డితో అఖిల్‌కు తీవ్ర‌మైన గ్యాప్ రావ‌డంతో ఆమె రాజ‌కీయాల‌కు ఇక కాలం చెల్లిన‌ట్టే క‌నిపిస్తోంది. బ్ర‌హ్మానంద‌రెడ్డి అఖిల‌ను నంద్యాల‌లో జోక్యం చేసుకునేందుకు ఒప్పుకోవ‌డం లేద‌ట‌. అదే జ‌రిగితే అటు సోద‌రుడి కోసం ఆళ్ల‌గ‌డ్డ సీటు త్యాగం చేసి... తాను రాజ‌కీయాల నుంచి త‌ప్పుకోవ‌డం మిన‌హా అఖిల్ చేసేదేం లేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: