తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మ‌రోమారు ఏపీలో ప‌ర్య‌టించ‌నున్నారు. ప‌లు ప్ర‌త్యేక‌త‌ల‌తో కేసీఆర్‌ ప‌ర్య‌ట‌న సాగ‌నుంది. కుటుంబసభ్యులతో కలిసి సోమవారం ఉదయం తమిళనాడులోని కంచికి వెళ్లనున్నారు. కంచిలోని అత్తి వరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఉదయం 10 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి ప్ర‌త్యేక విమానంలో వెళ్ల‌నున్నారు. ఇదిలాఉండ‌గా, ఈ ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న న‌గ‌రి ఎమ్మెల్యే రోజా ఇంటికి వెళ్ల‌నున్నారు.


హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకుంటారు. అనంత‌రం నగరిలోని రోజా స్వగృహానికి విచ్చేసి అక్కడినుంచి నేరుగా కంచికి బయలుదేరుతారు. కంచిలో అత్తి వరదరాజస్వామి వారిని దర్శించుకొని...తిరిగి మళ్లీ మధ్యాహ్నం భోజనానికి రోజా స్వగృహానికి వెళ్ల‌నున్నారు. ఈ సందర్భంగా ఇందుకు సంబంధించిన స్వాగత, బందోబస్తు ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం నిమగ్నమై వుంది. ఈ కార్యక్రమమాల్లో జిల్లా మంత్రులతో పాటు, ప్రజా ప్రతినిధులు పాల్గొనున్నారు.


అత్తివ‌ర‌దరాజ స్వామి దేవాల‌యం ఎంతో ప్ర‌త్యేక‌త‌ను క‌లిగి ఉంది. తమిళనాడులోని కాంచీపురంలో 40 ఏళ్లకొకసారి దర్శనమిచ్చే అత్తి వరదరాజ స్వామి 1979లో భక్తులకు దర్శనమిచ్చిన స్వామి మరలా ఈ ఏడాది జూన్‌ 1 నుంచి భక్తులకు దర్శనమిస్తున్నారు.  ఆలయ కోనేటి గర్భంలో ఉండే అత్తి వరదస్వామి 40 సంవత్సరాలకొకసారి 40 రోజుల పాటు భక్తులకు దర్శనమిస్తారు. ఈ నెల 17వరకూ దర్శనమిచ్చే స్వామిని దర్శించుకునేందుకు ప్రస్తుతం రోజుకు సుమారు 3 లక్షలమంది భక్తులు వస్తున్నారు. తొమ్మిది అడుగుల పొడవైన స్వామివారి విగ్రహం ఈ సమయంలో మొదటి 38 రోజులు శయన భంగిమలోనూ, చివరి 10 రోజులు నిలబడి ఉన్నట్టుగా దర్శనమిస్తుంది. ఉదయం, సాయంత్రం రెండు పూటలు స్వామికి సహస్రనామార్చన జరుగుతుంది. ఉదయం 6 గం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శించుకోవచ్చు. తాకిడి ఎక్కువగా ఉండడం వలన ప్రస్తుతం స్వామి వారి దర్శననానికి పది గంటల సమయం పడుతోందని నిర్వాహకులు తెలిపారు. చివరి రెండు రోజులు కేవలం సాధారణ భక్తులనే అనుమతిస్తామని ఆలయ నిర్వహకులు చెబుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: