ఓడిన ఆ లీడర్ దగ్గరికే పనుల కోసం ప్రజలు వెళుతున్నారట.? అధికారులు కూడా అటే చూస్తున్నారట. దీంతో సదరు ఎమ్మెల్యే గారికి చిర్రెత్తుకొచ్చి చిటపటలాడి పోతున్నారట. ప్రకాశం జిల్లా పేరు చెప్పగానే వెంటనే ఏపీ అటెన్షన్ మొత్తాన్నీ గెయిన్ చేసే నియోజకవర్గం ఒకటుంది అదే చీరాల. ఏపీ ఎలక్షన్ వార్ లో మరింతగా ఈ నియోజకవర్గం చుట్టూ సెగ రేగింది. ఎందుకంటే ఎన్నికల ముందు వరకు చీరాల అంటే గుర్తుకొచ్చేది ఆమంచి క్రిష్ణమోహన్. కాని ఎన్నికలకు తెర లేవగానే ఆమంచి వర్సెస్ కరణం ఎపిసోడ్ స్టార్టైంది. 



ఇద్దరు పక్కా మాస్ లీడర్ల మధ్య సాగిన ఆ పోరులో ఆమంచి కృష్ణ మోహన్ ఓటమిపాలయ్యారు. కరణం బలరాం గెలిచారు. మామూలుగా అయితే ఓడిన ఆమంచి డల్ కావాలి. గెలిచిన కరణం కనుసన్నల్లో నియోజకవర్గంలో అన్నీ జరగాలి. కానీ, ఓడిన ఆమంచి అధికార పార్టీలో ఉన్నారు. గెలిచిన కరణం బలరామ్ ప్రతిపక్షంలో ఉన్నారు. చెప్పేదేముంది అంతా ఆమంచి అండర్ లో అన్నట్టుగా తయారైందట పరిస్థితి. వైసిపి నేత ఆమంచి ఓటమి పాలైనా పార్టీ పవర్ లో ఉండడంతో ప్రజలు వివిధ పనుల కోసం ఆయన వద్దకే వెళ్తున్నారట.


అటు అధికారులు కూడా తాను చెప్పినట్టే వినాలని ఆమంచి చెప్తున్నారట. ఇటు ఎమ్మెల్యే కరణం బలరామ్ ఈ పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఎమ్మెల్యే అయిన తన మాట వినకుంటే తను చెప్పిన పనులను చేయకుంటే ప్రభుత్వ కార్యాలయాల ముందు బైఠాయిస్తానని ఆయన అధికారులకు వార్నింగ్ ఇస్తున్నారట. కానీ, పవర్లో ఉన్న పార్టీకే వ్యాల్యూ ఉంటుంది. కాబట్టి ఆమంచి బాటకు తిరుగులేకుండా పోయిందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోందట. 



ఇటీవల గ్రామ సచివాలయ వాలంటీర్ల ఎంపిక విషయంలో ఇద్దరి మధ్య మరోసారి సెగ రాజుకుంటోందట. ఆమంచి సిఫార్స్ చేసిన కొంతమందిని వాలంటీర్ లుగా ఎలా ఎంపిక చేస్తారంటూ అధికారుల మీద ఫైరయ్యారట కరణం బలరాం. తమ వర్గీయులకు కూడా వాలంటీర్ పోస్టులు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారట. దీనికి కౌంటర్ గా నియోజకవర్గంలో కరణం దౌర్జన్యాలు ఎక్కువైపోయాయంటూ మంత్రి బాలినేనికి ఫిర్యాదు చేశారట ఆమంచి. ఓడిన వ్యక్తి మాటల్ని ఎలా వింటారంటూ అధికారులు మీద కరణం భగ్గుమంటున్నారట. దీంతో చీరాల పొలిటికల్ స్క్రీన్ మీద నువ్వా నేనా ఎపిసోడ్ వాడీవేడిగా నడుస్తోందట.


మరింత సమాచారం తెలుసుకోండి: