ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఓ కోరిక కోరారు. మరి ఆ కోరిక మోడీ తీరుస్తారా లేదా అన్నది వచ్చే అక్టోబర్ లో తేలనుంది. ఇంతకీ ఆ కోరిక ఏంటనుకుంటున్నారా... వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలనుకుంటున్న రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించాలని.. మరి ఆ కోరిక తీరాలంటే.. మోడీ విజయవాడ రావాల్సి ఉంటుంది.


ఈ మేరకు జగన్ ఇప్పటికే మోడీని ఆహ్వానించారట. ఈ విషయాన్ని జగనే స్వయంగా చెప్పారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అమలు చేయనున్న పథకాల యాక్షన్‌ ప్లాన్‌ను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు పథకాల అమలుకు సంబంధించిన షెడ్యూల్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం వివరించారు.


ఇక ఈ షెడ్యూల్‌ ప్రకారం.. అక్టోబరు 15న రైతు భరోసా ప్రారంభిస్తామని సీఎం జగన్‌ చెప్పారు. ఈ కార్యక్రమ ప్రారంభానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించామని అన్నారు. దేశంమొత్తం ఈ కార్యక్రమాల వైపు చూడాలని సీఎం ఆకాక్షించారు. ఎక్కడా పొరపాట్లు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందని స్పష్టం చేశారు.


గ్రామ సచివాలయమే కౌలు రైతులకు కార్డులు ఇస్తుందని సీఎం జగన్ వెల్లడించారు. 11 నెలల కాలానికి ఇది వర్తిస్తుందని అన్నారు. రైతులకు ఎలాంటి నష్టం రాకుండా, భూమిపై తమకున్న హక్కులకు భంగం వాటిల్లకుండా కేవలం పంటపైన మాత్రమే 11 నెలలపాటు కౌలు రైతుకు హక్కు లభిస్తుందని తెలిపారు. కౌలు రైతులకు కార్డులు అందగానే వాళ్లు రైతు భరోసాకు అర్హులవుతారని చెప్పారు. ఈ ఒక్కసారికి మాత్రమే రైతు భరోసా రబీకి ఇస్తున్నామని.. వచ్చే ఏడాది నుంచి మేలో ఇస్తామన్నారు. తద్వారా ఖరీఫ్‌లో రైతులకు బాసటగా ఉంటామని జగన్ అంటున్నారు. ఇంతకీ జగన్ కోరికను మోడీ తీరుస్తారా..?


మరింత సమాచారం తెలుసుకోండి: