మూడేళ్ల నుంచి ప్రయాణికులు ఎదురుచూస్తున్న ఉదయ్ రైలు రానే వచ్చింది. విశాఖ–విజయవాడ నగరాల మధ్య ఈ డబల్ డెక్కర్ రైలు ఆగష్టు 16 నుంచి పరుగులు తీయనుందని రైల్వే వర్గాల సమాచారం. దీనిని ఉత్కృష్ట డబుల్ డెక్కర్ ఎయిర్ కండీషన్డ్ యాత్రి రైలుగా కూడా పేరు ఉంది. నిజానికి ఈ రెండు నగరాల మధ్య ఈ రైలును 2016 లోనే కేంద్రం ప్రకటించింది. అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ రైలు ఇక పరుగులు తీయడమే ఆలస్యం.



నెల రోజులుగా ఈ రైలు వాల్తేర్ యార్డులోనే ఉండిపోయింది. దీంతో రైల్వే అధికారులు తీసుకున్న చర్యలతో పట్లాలెక్కబోతోంది. ట్రైల్ రన్ కోసం కొన్ని బోగీలను విశాఖ నుంచి చెన్నై వరకూ పంపించారు. మరికొన్ని భోగీలను విశాఖ నుంచి విజయనగరం వరకూ పంపించారు. ట్రయిల్ రన్ పూర్తయ్యాక ఈ రైలుకు అలంకరణ పనులు చేపట్టి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల అనంతరం ఆగష్టు 16 నుంచి పట్టాలెక్కించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఈ రైలు సమాచారంపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.



ఈ రైలు వారానికి ఐదు రోజులు.. సోమ, మంగళ, బుధ, శుక్ర, శనివారాల్లో ప్రయాణిస్తుంది. ఈ డబుల్ డెక్కర్ ఏసీ రైలును చాలా విలాసవంతంగా తీర్చిదిద్దారు. రోజువారీ ప్రయాణికులకు ఈ రైలు ఎంతో ఉపయుక్తంగా ఉండబోతోంది. విశాఖలో 22701 నెంబరుతో ఉదయం 5.45 గంటలకు బయలుదేరి విజయవాడకు 11.45 కు చేరుకుంటుంది. మళ్లీ విజయవాడలో 22702 నెంబరుతో సాయంత్రం 5.30 కి బయలుదేరి విశాఖకు రాత్రి 10.55 గంటలకు చేరుకుంటుంది. మొత్తంగా విశాఖ నుంచి విజయవాడకు 5గంటల 25 నిమిషాల్లో చేరుకునే ఈ రైలు విజయవాడ నుంచి విశాఖకు 5 గంటల 30 నిమిషాల్లో చేరుకోనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: