పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తలదించుకుంటారట. ఎవరి ముందు అంటారా..? లక్షల మెదళ్లను కదిలించగలిగే శక్తి ఉన్న కవులు, రచయితల ముందు పవన్ తలవంచి నిలుచుంటారట. వాళ్లంటే ఉన్న గౌరవంతోనే ఆ పని చేస్తారట. ప్రపంచంలో ఎవరినైనా ఎదిరించొచ్చుగానీ లక్షల మెదళ్లను కదిలించగలిగే శక్తి ఉన్న కవులు, రచయితలను ఎదుర్కో వడం చాలా కష్టమన్నారు పవన్. అలాంటి వ్యక్తులపట్ల అపారమైన గౌరవం ఉందని, అందుకే సినిమా వేడుకల్లో తల ఎగరేయకుండా వాళ్ల ముందు తలదించుకొని కూర్చుంటానని అన్నారు.


చరిత్ర రాసేవారు లేకపోతే చరిత్ర కనుమరుగైపోతుందని, పుస్తకాల్లో నిక్షిప్తం చేయకపోతే తక్కువ స్థాయి వ్యక్తులు రాసిందే చరిత్రగా చలామణీ అవుతుందని పవన్ కల్యాణ్ అన్నారు. ఎన్నో రక్తపు చుక్కలు కారితే తప్ప ఒక్క వాక్యం కూడా రాయలేమని ఒక ఇంగ్లీష్ కవి చెప్పిన మాట ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి... అలాంటిది కనిపించని రక్తాన్ని చిందించి లక్షల పేజీలు రాసిన కవులు, రచయితలకు జోహార్లన్నారు. ఆ కనిపించని రక్తమే మన రక్తాన్ని మరిగించి ప్రజా సమస్యలపై మాట్లాడేలా చేస్తుందని అన్నారు.


మంగళవారం సాయంత్రం హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రముఖ రచయిత, పత్రికా సంపాదకుడు, రాజకీయ విశ్లేషకుడు శ్రీ తెలకపల్లి రవి రాసిన ‘మన సినిమాలు, అనుభవాలు - చరిత్ర – పరిణామం’ పుస్తకాన్ని పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు.“అన్ని మైత్రిల కంటే సాహిత్య మైత్రీ చాల గొప్పదని సీనియర్ పాత్రికేయులు నాగేంద్ర గారు ఒక పుస్తకం మీద రాసిచ్చారు. ఆ మాట నాకు ఇప్పటికీ గుర్తుండిపోయింది.


బందోపాధ్యాయ గారు రాసిన వనవాసి అనే పుస్తకం నన్ను ప్రకృతి ప్రేమికుడిగా మార్చేసింది. అలాంటి పుస్తకాన్ని శ్రీ తనికెళ్ళ భరణి గారు గిఫ్ట్ గా ఇచ్చినపుడు గబ్బర్ సింగ్ సినిమా హిట్ అయినదాని కంటే ఎక్కువ ఆనందం కలిగిందని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు శ్రీ తనికెళ్ళ భరణి, శ్రీ పరుచూరి గోపాలకృష్ణ, శ్రీ సుద్దాల అశోక్ తేజ, శ్రీ రావి కొండల రావు, సినీ పాత్రికేయుడు డా.రెంటాల జయదేవ పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: