తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ధనిక రాష్ట్రం.. ఆర్థికంగా అన్నివిధాలా వనరులు ఉన్న రాష్ట్రంగా చెబుతారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు రాజధానిగా ఉన్న కాలంలో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఆ నగర ఆదాయమంతా కేవలం తెలంగాణకే చెందడం వల్ల తెలంగాణ ధనిక రాష్ట్రంగా మారిందనే విశ్లేషణలు ఉన్నాయి.


నిజమే.. హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి ఓ పెద్ద ఎస్సెట్.. దేశంలోనే ఐదు ప్రధాన నగరాల్లో చోటు సంపాదించిన మెట్రో నగరం. అంతర్జాతీయ విమానాశ్రయంతో సహా అన్ని హంగులు ఉన్న మహానగరం.. కానీ తెలంగాణలో ఒక్క హైదరాబాద్ మినహా మళ్లీ ఆ స్థాయిలో కానీ.. దానికి సమీపంలో కానీ నిలిచే నగరాలే లేవు.


తెలంగాణలో హైదరాబాద్ మినహా ఎయిర్ పోర్టు ఉన్న మరో నగరమే కనిపించదు. కానీ ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితి అలా కాదు. అంతర్జాతీయ స్థాయిలో కాకున్నా.. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కడప ఇలా అనేక నగరాల్లో విమానాశ్రయాలు ఉన్నాయి. అందుకే తెలంగాణలోనూ మరిన్ని ఎయిర్ పోర్టులు నిర్మించాలని తెలంగాణ ప్రయత్నిస్తోంది.


ఆదిలాబాద్‌, పెద్దపల్లి, నిజామాబాద్‌, వరంగల్‌, మహబూబ్‌నగర్‌, కొత్తగూడెంలలో విమానాశ్రయాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఇందుకోసం పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ పథకం ఉడాన్‌ ను ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఆదిలాబాద్‌, పెద్దపల్లి, నిజామాబాద్‌, వరంగల్‌, మహబూబ్‌నగర్‌, కొత్తగూడెంలో విమానాశ్రయం నిర్మాణానికి ఎంత వరకూ అనుకూల పరిస్థితులు ఉన్నాయో తెలుసుకునేందుకు.. తెలంగాణ సర్కారు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియాను కన్సల్టెన్సీగా నియమించింది.


ఆదిలాబాద్‌, పెద్దపల్లి, నిజామాబాద్‌, వరంగల్‌, మహబూబ్‌నగర్‌, కొత్తగూడెం ప్రాంతాల్లో విమానాశ్రయాల నిర్మాణం సాధ్యాసాధ్యాలపై ఏఏఐ సెప్టెంబరు నాటికి నివేదిక అందించాల్సి ఉంటుంది. ఎయిర్‌ పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా అధికారుల బృందం.. ఈ నెల 19 నుంచి 3 రోజులు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తుంది. ఈ బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా తెలంగాణ సర్కారు ముందడుగు వేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: