భారీ వ‌ర్షాలు ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు ప‌రువును కాస్తా తీసేశాయి. కృష్ణా న‌ది క‌ర‌క‌ట్ట‌పై ఉన్న త‌న ఇంటి విష‌యంలో బాబు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాట‌ల‌కు, ఇప్పుడు వ‌ర‌ద‌లు షాక్ ఇచ్చాయి. దీంతో చంద్ర‌బాబు త‌న ప‌రువు తానే తీసుకున్న‌ట్ల‌య్యింది. ప‌శ్చిమ క‌నుమ‌ల్లో కురుస్తోన్న భారీ వ‌ర్షాల‌కు కృష్ణా న‌ది పొంగి పొర్లుతోంది. పైన ఉన్న ప్రాజెక్టుల గేట్లు అన్ని ఎత్తివేయ‌డంతో విజ‌య‌వాడలో కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. పులిచింతల ప్రాజెక్ట్ నుంచి భారీగా వరద నీరు రావడంతో ప్ర‌కాశం బ్యారేజ్ గేట్లు కూడా పైకెత్తి నీళ్లు స‌ముద్రంలోకి వ‌దులుతున్నారు.


ఈ క్ర‌మంలోనే గుంటూరు జిల్లాలో చంద్ర‌బాబు నివాసం వైపు ఉన్న క‌ర‌క‌ట్ట వ‌ద్ద కృష్ణ‌మ్మ ఉధృతంగా ప్ర‌వ‌హిస్తోంది. కృష్ణ‌మ్మ క‌ర‌క‌ట్ట పై నుంచి కూడా ప్ర‌వ‌హిస్తుండ‌డంతో చంద్ర‌బాబు నివాసంలోకి సైతం వ‌ర‌ద‌నీరు వ‌చ్చి చేరింది. ఇక కొద్ది రోజుల క్రిత‌మే చంద్ర‌బాబు నివాసంపై అసెంబ్లీ సాక్షిగా వైసీపీ నేత‌లు వ‌ర్సెస్ బాబు మ‌ధ్య పెద్ద యుద్ధ‌మే న‌డిచింది. చంద్ర‌బాబు త‌క్ష‌ణ‌మే త‌న ఇంటికి ఖాళీ చేయాల‌ని కూడా వైసీపీ డిమాండ్ చేసింది.


వైసీపీ డిమాండ్‌పై అసెంబ్లీలో మాట్లాడిన చంద్ర‌బాబు తాను ఉంటోన్న ఇళ్లు స‌క్ర‌మ‌మే అని... న‌ది త‌న స్వ‌రూపాన్ని మార్చుకుంద‌ని కూడా వాదించేందుకు ప‌డ‌రాని పాట్లు ప‌డ్డారు. చివ‌ర‌కు నేజనల్ ఎన్విరాన్ మెంటల్ బోర్డు ఇచ్చిన నోటీసులు కూడా వాళ్ల ప‌ట్టించుకోలేదు. ఇక ఇప్పుడు కృష్ణ‌మ్మ ఏకంగా క‌ర‌క‌ట్ట దాటేసి బాబు ఇంట్లోకి రావ‌డంతో బాబు గ‌తంలో తాను మాట్లాడిన మాట‌ల‌ను స‌మ‌ర్థించుకోలేని ప‌రిస్థితి వ‌చ్చేసింది. 


చంద్ర‌బాబు ఉంటోన్న‌ లింగమనేని గెస్ట్‌హౌస్‌ మెట్లపైకి నీళ్లు రావడంతో బాబు నివాసాన్ని ప‌ర్య‌వేక్షిస్తోన్న వారు వెంట‌నే ఎలెర్ట్ అయ్యారు. కింద ఉన్న ఫ‌ర్నీచ‌ర్‌ను అప్ప‌టిక‌ప్పుడు పై ఫ్లోర్‌లోకి మార్చేశారు. చివ‌ర‌కు చంద్ర‌బాబు కాన్వాయ్‌ను కూడా అప్ప‌టిక‌ప్పుడు హ్యాఫీ రిసార్ట్స్‌లోకి త‌ర‌లించేశారు. న‌ది వ‌ర‌ద పెరిగిన‌ప్పుడు బాబు ఉంటోన్న లింగ‌మ‌నేని గెస్ట్‌హౌస్‌లోకి వాట‌ర్ వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌ని గ‌తంలో వైసీపీ చెప్పిన‌ప్పుడు విన‌ని బాబు ఇప్పుడు క‌క్క‌లేక మింగ‌లేక చందంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.


ఇది జ‌రిగి ఈ యేడాదో రెండేళ్లో అయితే అంద‌రూ మ‌ర్చిపోయేవారే... అసెంబ్లీలో చ‌ర్చ జ‌రిగిన కొద్ది రోజుల‌కే వైసీపీ చెప్పిన‌ట్టుగా ఇప్పుడు బాబు ఇళ్లు మునిగిపోవ‌డంతో టీడీపీ వాళ్లు సైతం త‌మ అధినేత వాద‌న‌ను స‌మ‌ర్థించుకోలేని ప‌రిస్థితి. ఇక ముంపున‌కు గురైన బాబు ఇంటిని స్థానిక మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి సంద‌ర్శించి... ప్ర‌తిప‌క్ష నేత‌గా బాబును కాపాడుకోవాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉంద‌ని చెప్పారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: