జగన్మోహన్ రెడ్డి మొండివాడన్న విషయం దేశరాజకీయాల్లో ఎవరిని అడిగినా చెబుతారు. ఇపుడు కొత్తగా చంద్రబాబునాయుడు చెప్పాల్సిన పనిలేదు. కాకపోతే అందరికీ ఎప్పుడో తెలిసిన విషయం చంద్రబాబుకు ఇపుడు అర్ధమవ్వటమే విచిత్రంగా ఉంది. ఇంతకీ చంద్రబాబు గోలేమిటంటే విద్యుత్ పిపిఏల సమీక్షలపై ఎంతమంది అభ్యంతరం చెప్పినా జగన్ వినటం లేదట. సమీక్షలపై జపాన్ పారిశ్రామికవేత్త కేంద్రానికి ఓ లేఖ రాస్తూ రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారట లేఖలో. ఆ విషయంపైనే చంద్రబాబు ట్విట్లర్లో ఓ ట్వీట్ పెట్టారు.

 

జగన్మోహన్ రెడ్డి పేరులోనే సగం మొండి తనం ఉందట. మిగితా సగం తన చేస్తున్న పనుల్లో కనిపిస్తోందట. విద్యుత్ పిపిఏలను సమీక్షించవద్దని కేంద్రం చెప్పినా వినలేదు, తాము చెప్పినా వినలేదు, చివరకు జపాన్ సంస్ధ కూడా లేఖరాసినా జగన్ పట్టించుకోవటం లేదంటూ చంద్రబాబు బోల్డు బాధపడిపోతున్నారు. నిజమే పిపిఏలపై సమీక్షలు వద్దని ఎంతమంది చెప్పినా జగన్ వినలేదు. విద్యుత్ పిపిఏల్లో జరిగిన భారీ అవినీతిని  బయటపెట్టేందుకే సమీక్షిస్తున్నట్లు చెప్పారు జగన్.

 

 నిజానికి జగన్ మొండితనం గురించి ప్రపంచానికి ఎప్పుడో తెలుసు. కాంగ్రెస్ లో ఉన్నపుడు సోనియాగాంధిని ఎదరించి బయటకు వచ్చినపుడే జగన్ మొండోడని అందరూ అనుకున్నారు. తర్వాత కేసులు పెట్టి జైల్లో పెట్టించినా లెక్క చేయలేదు. తర్వాత బయటకు వచ్చి జనాల్లో ఓదార్పు యాత్రలు చేశారు. 2014 ఎన్నికల్లో తనను అందరూ వ్యతిరేకించినా 67 సీట్లు సాధించుకున్నారు. తన పార్టీ ఎంఎల్ఏలను చంద్రబాబు లాక్కుంటున్నా ఎక్కడా భయపడలేదు.

 

జనాలతో మమేకం అయ్యేందుకు ఏకంగా 3658 కిలోమీటర్ల పాదయాత్ర మొదలుపెట్టి సక్సెఫుల్ గా ముగించినపుడే జగన్ మొండితనాన్ని ప్రపంచం గుర్తించింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబును చిత్తుగా ఓడించి 151 సీట్లు సాధించినపుడే జగన్ మొండితనానికి హ్యాట్సాప్ చెప్పింది ప్రపంచం.  విద్యుత్  పిపిఏల సమీక్ష పూర్తయితే తన అవినీతి ఎక్కడ బయటపడుతుందో అన్న భయమే చంద్రబాబులో కనబడుతోంది. కాబట్టి జగన్ ను మొండివాడని ఇపుడు చంద్రబాబు సర్టిఫై చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే.


మరింత సమాచారం తెలుసుకోండి: