రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలతో ‘స్టేట్‌ హెల్త్‌ ప్రొఫైల్‌’ సిద్ధం చేస్తామని, దీనికి చింతమడక నుంచే శ్రీకారం చుడతామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్ప‌టికే చింత‌మ‌డ‌క‌లో ఆ ప్ర‌క్రియ పూర్త‌యింది. ఈ నెల 5న యశోద ఆస్పత్రి సౌజన్యంతో పెద్ద ఎత్తున హెల్త్‌ క్యాంపు ఏర్పాటు చేశారు. ఎనిమిది రోజుల పాటు ప్రతి రోజూ 600 మందికి చొప్పున వైద్య పరీక్షలు నిర్వహించారు. 46 రకాల వైద్య పరీక్షలు చేశారు. ఇదే ఒర‌వ‌డిలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ యోగితా రాణా ఉత్తర్వులు జారీచేశారు.


యూనివర్సల్‌ హెల్త్‌ స్క్రీనింగ్‌ ప్రోగ్రాం పేరుతో తెలంగాణ ప్ర‌భుత్వం సమగ్ర ఆరోగ్య సర్వే చేపట్ట‌నుంది. ఆగస్ట్ 26వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు గ్రామాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి స్క్రీనింగ్‌ ప్రక్రియ చేపట్టనున్నారు. దాదాపు కోటి కుటుంబాలను కలిసి ఆరోగ్య పరిక్షలు చేస్తారు. కుష్టూ, టీబీ, పాలియేటివ్‌ కేర్, మానసిక వైద్యం, అసంక్రమిత వ్యాధులు సహా మొత్తం 13 రకాల వ్యాధులను గుర్తించి వాటిని నయం చేసేందుకు తగు ఏర్పాట్లు ప్రభుత్వం చేయ‌నుంది. 


వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది బృందాలుగా ఏర్పడి ఈ పరీక్షలను చేపడుతారు. ఒక్కో టీమ్ కి ఇద్దరు చొప్పున స‌భ్యులు ఉంటారు. దాదాపు కోటి కుటుంబాలను కలిసి ఆరోగ్య పరీక్షలు చేస్తారు. ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, గ్రామస్థాయి సామాజిక ఆరోగ్య కార్యకర్తలు గ్రామంలో ఉదయం 6 గంటల నుంచి 9.30 గంటల వరకు ఇంటింటికీ తిరిగి ప్రజలకు స్క్రీనింగ్‌ చేస్తారు. రోజూ 20 ఇళ్లకు స్క్రీనింగ్‌ నిర్వహించనున్నారు. డ్వాక్రా, స్వయం సహాయక గ్రూపులు, అంగన్‌వాడీ సభ్యుల సహకారంతో స్క్రీనింగ్ చేసి నివేదికలను జిల్లా కార్యాలయానికి పంపుతారు. అదే నివేదికల‌ను విలేజ్‌ హెల్త్‌ సర్వీస్ యాప్‌లో నమోదు చేస్తారు.


రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోయే అందరికీ ఆరోగ్య స్క్రీనింగ్‌ కార్యక్రమం నిర్వహణ కోసం రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమం ఆగస్ట్ 17న జరగనుంది. జిల్లాల్లో 20 నుంచి 22 వరకు వైద్య సిబ్బందికి శిక్షణ ఇస్తారు. హెల్త్‌ స్క్రీనింగ్‌ ప్రోగ్రాంలో భాగంగా, ఉదయం 6.30 నుంచి 9.30 వరకు స్క్రీనింగ్‌ ప్రక్రియ జరిపి నివేదికలను సిద్దం చేసుకుంటారు. ఒకవేళ అప్పుడు ఇంట్లో ఎవరూ లేకుంటే సాయంత్రం వెళ్తారు. ఏదైనా వ్యాధి ఉన్నట్లు అనుమానిస్తే ప్రొటోకాల్‌ ప్రకారం సంబంధిత పరీక్షలను వారం రోజుల్లో చేయించాల్సి ఉంటుంది. ప్రతి ఇంటి కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేస్తారు.  మున్ముందు గ్రామాల వారీగా ఆరోగ్య రికార్డు తయారు చేయడానికి ఈ వివరాలు ఉపయోగపడుతాయని ప్ర‌భుత్వం భావిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: