జగన్మోహన్ రెడ్డి కొత్తగా  ప్రారంభించిన గ్రామ, పట్టణ, వార్డ వాలంటీర్ల వ్యవస్ధలో దాదాపు 2,66,796 మంది వాలంటీర్లను నియమించారు. 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఈ వ్యవస్ధను జగన్ ప్రారంభించారు. జిల్లాల్లో మంత్రులు ప్రారంభించిన విషయం తెలిసిందే. గ్రామస్వరాజ్యంలో భాగంగా పంచాయితీ రాజ్ వ్యవస్ధను బలోపేతం చేయటమే తన లక్ష్యంగా జగన్ చెప్పుకున్నారు.

 

కొత్తగా ఏర్పాటైన వ్యవస్ధలో గ్రామీణ ప్రాంతాల్లో 1,93,421 మంది వాలంటీర్లు, పట్టణ, వార్డుల్లో 73,375 మంది వాలంటీర్లను నియమించారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ప్రతి 50 ఇళ్ళకు ఓ వాలంటీర్ ఉంటారు. అదే గిరిజన ప్రాంతాల్లో అయితే ప్రతీ 35 ఇళ్ళకు, పట్టణ ప్రాంతాల్లో అయితే 50-100 ఇళ్ళకు ఓ వాలంటీర్ ఉంటారు. ఆగస్టు 15వ తేదీ నుండే వీళ్ళంతా విధుల్లో చేరినట్లే లెక్క. మొత్తం అపాయింట్ అయిన వాలంటీర్లలో 1.33 లక్షల మంది మహిళలు. మిగిలిన పోస్టులను రిజర్వేషన్ల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటిలకు కేటాయించారు.

 

వాలంటీర్లకు కేటాయించిన ఇళ్ళ ప్రకారం ఆయా కుటుంబసభ్యుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించాల్సిన బాధ్యత వాలంటీర్లపైనే ఉంటుంది. తమ పరిధిలోని ప్రాంతాల్లో రోడ్ల పరిస్ధితి, మంచినీటి సరఫరా, డ్రైనేజి సదుపాయాలు, కుటుంబాలు తీసుకుంటున్న రేషన్ వివరాలను సేకరించాలి.  అర్హులైన పేదలకు  రేషన్ అందేట్లు చూడాలి.

 

కుటుంబాల్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే వారిని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళ్ళి చికిత్స చేయించాల్సిన బాధ్యత కూడా వాలంటీర్ దే. లేకపోతే వైద్యులను బాధితుల ఇంటికన్నా తీసుకెళ్ళాలి.  అక్షరాస్యత వివరాలు సేకరించాలి. బడిఈడు పిల్లలను స్కూళ్ళల్లో చేర్పించాలి. చిన్న పిల్లలుంటే వాళ్ళకు అవసరమైన టీకాలు వేయించాలి. కేంద్ర, రాష్ట్ర పథకాలపై జనాల్లో అవగాహన కల్పించాలి.  వాలంటీర్ల వ్యవస్ధ ఏర్పాటు ద్వారా జగన్ ఆశించింది జరగాలంటే అపాయింట్ అయిన వాలంటీర్లు చిత్తశుద్దితో పనిచేయాలని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: