టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇప్పుడు బయటకంటే.. ఎక్కువగా ట్విట్టర్లోనే రాజకీయాలు చేసేస్తున్నారు. నిత్యం ట్విట్టర్ ద్వారా విమర్శలు చేస్తూ అదే రాజకీయం అనుకుంటున్నారేమో అనే విమర్శలు మూటగట్టుకుంటున్నారు. అందులోనూ చేసే విమర్శల్లోనూ అంతగా పస లేక నవ్వులపాలు అవుతున్నారు.


చంద్రబాబు పాలనలో వర్షాలు పడవనే ఓ సెంటిమెంట్ ఉంది. ఆయన కాలంలో అనేక సార్లు వర్షాలు పడినా.. ఆ అపప్రథ మాత్రం తొలగిపోలేదు.. ఇప్పుడు దాన్ని గుర్తు చేసేలా నారా లోకేశ్ ట్వీట్ చేయడం అసందర్భంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో పెద్దగా వర్షాలు పడకపోయినా... పొరుగు రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు ఏపీకి పుష్కలంగా నీరు దొరుకుతోంది. గోదావరి ఉప్పొంగుతూ రోజులు టీఎంసీల కొద్దీ నీరు సముద్రం పాలవుతోంది.


గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా కృష్ణా నది కూడా ఉప్పొంగుతోంది.. నాగార్జున సాగర్, శ్రీశైలం నిండి కృష్ణమ్మ కూడా సముద్రం బాట పడుతోంది. ఇలాంటి సమయంలో లోకేశ్ పోస్టు చేసిన ఓ ట్వీట్ విమర్శలపాలవుతోంది.


ఇంతకీ ఆ ట్వీట్ లో ఏముందంటే..

“ జగన్ వచ్చారని... వరుణుడు పారిపోయాడా ?... సాగునీరు రాక ఉత్తరాంధ్ర ఉసూరుమంటోంది. చినుకు రాలక రాయలసీమ రాళ్లసీమలా కనిపిస్తోంది. గుక్కెడు నీటి కోసం ప్రకాశం ప్రజలు రోడ్డెక్కుతున్నారు. తమ వల్లే వానొచ్చిందని, వరదొచ్చిందంటూ వైకాపా నేతలు మా జగనన్న భగీరధుడు అంటూ బిల్డప్ ఇస్తున్నారు.


ఇప్పటి వరకూ 3 జిల్లాల్లోనే సాధారణ, 10 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. చాలా ప్రాంతాలలో తాగేందుకు నీరివ్వమంటూ జనాలు ఆందోళనకు దిగుతున్నారు. మరి వరుణుడు ఏమయ్యాడు, జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు అని తెలిసిపోయి పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాడా? వైకాపా మేధావులు మాత్రమే సమాధానం చెప్పాలి.” ఇలా ఉంది. ఏపీకి వర్షాలు రాకపోయినా కృష్ణా, గోదావరి ఉప్పొంగుతున్న వేళ.. ఏదో ఒక సాకు వెదికినట్టు లోకేశ్ ట్వీట్ చేయడం విమర్శల పాలవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: