వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎక్కడా తగ్గటం లేదు. జగన్మోహన్ రెడ్డి పై చంద్రబాబునాయుడు, లోకేష్ ఆరోపణలు, విమర్శలకు ధీటుగా స్పందిస్తున్నారు. అదే సమయంలో వాళ్ళకన్నా నాలుగు అడుగులు ఎక్కువే వేస్తున్నారు. జగన్ కు వ్యతిరేకంగా చంద్రబాబు, లోకేష్ ట్విట్టర్ ను ఎంతలా ఉపయోగించుకుంటున్నారో అంతకన్నా ఎక్కువగానే వారికి వ్యతిరేకంగా విజయసాయి ఉపయోగిస్తున్నారు.


చంద్రబాబు సిఎంగా ఉన్నంత కాలం  విజయసాయి మరీ రెచ్చిపోయేవారు. టిడిపి పాలనలోని లోపాలను, అవినీతిని బలంగా ట్విట్టర్ ద్వారా ప్రపంచానికి తెలియజేసేవారు. దాంతో వైసిపికి మద్దతుగా నిలిచిన ఇతర  సోషల్ మీడియా యాక్టివిస్టులు విజయసాయి చేసే ఆరోపణలకు, విమర్శలకు  విపరీతంగా ప్రచారం కల్పించేవారు. వైసిపి అఖండ విజయం సాధించటంలో వైసిపికి అనుబంధంగా పనిచేసిన సోషల్ మీడియా పాత్ర కూడా చాలా ఎక్కువనే చెప్పాలి.

 

అలాంటిది ఎప్పుడైతే వైసిపి అధికారంలోకి వచ్చిందో చాలామంది నేతలు కారణాలు తెలీదుకానీ చప్పబడిపోయారు. ఎవరో ఒకరిద్దరు మంత్రులు, కొందరు నేతలు మినహా చంద్రబాబు, టిడిపి నేతల ఆరోపణలకు పెద్దగా స్పందిచటం లేదన్నది వాస్తవం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. ఘోరఓటమి తర్వాత చంద్రబాబు కూడా మీడియా సమావేశాలు దాదాపు మానుకున్నారు.

 

సిఎంగా ఉన్నపుడు చంద్రబాబు దాదాపు ప్రతిరోజు గంటలపాటు మీడియా సమావేశాలు పెట్టి బుర్రలు తినేసేవారు. అలాంటిది ఓటమి తర్వాత మీడియాకు చంద్రబాబు మొహం చాటేస్తున్నారు. అందుకనే జగన్ పై ఆరోపణలకు, విమర్శలకు ప్రత్యామ్నాయంగా ట్విట్టర్ ను ఉపయోగించుకుంటున్నారు. సరే లోకేష్ ఎలాగూ ట్విట్టర్ లో నుండి బయటకు రావటం లేదులేండి.

 

అందుకనే విజయసాయి కూడా తండ్రి కొడుకులకు ట్విట్టర్లోనే ధీటుగా సమాధానాలు చెబుతున్నారు. ఒకవిధంగా తండ్రి, కొడుకుల ఆరోపణలు, విమర్శలకు వైసిపి తరపున విజయసాయి ఒక్కరే సమాధానాలు ఇస్తున్నట్లు లెక్క. తండ్రి, కొడుకులపై విజయసాయి ప్రతిరోజు ట్విట్టర్లో విరుచుకుపడుతున్న విషయం చూస్తుంటే ఎంపి ఎక్కడా తగ్గటం లేదని అర్ధమైపోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: