జ‌మ్మూక‌శ్మీర్‌పై పాకిస్థాన్ కుట్రలు ఇంకా కొన‌సాగుతున్నాయి. అంత‌ర్జాతీయ స‌మాజం క‌లిసి రాక‌పోయిన దేబిరించ‌డంలో బిజీగా ఉన్న పాక్‌కు ఊహించ‌ని మ‌ద్ద‌తు దొరికింది. ప‌క్క‌లో బ‌ల్లెంలా ఉన్న చైనా తాజాగా అండ‌గా నిలిచింది. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే 370వ అధికరణాన్ని రద్దుచేస్తూ భారత్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో శుక్రవారం అంతర్గత సమావేశం జరుపాలని ఐక్యరాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలి నిర్ణయించింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 10 గంటలకు సమావేశం జరుగుతుందని, కశ్మీర్ అంశాన్ని ఎజెండాలో చేర్చారని పలువురు దౌత్యవేత్తలు తెలిపారు. కశ్మీర్‌పై ఐరాస భద్రతామండలిలో రహస్యంగా చర్చించాలని చైనా కూడా అధికారికంగా విజ్ఞప్తి చేసింది. కశ్మీర్‌పై చర్చించడం అత్యంత అరుదైన సందర్భమని చెప్పారు. 


కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పాకిస్థాన్.. దీనిపై చర్చించడానికి సమావేశం ఏర్పాటుచేయాలని ఐరాస భద్రతామండలిని కోరింది. ఈ మేరకు భద్రతామండలి అధ్యక్షురాలు జువన్నా రోయెంకాకు పాక్ విదేశాంగమంత్రి షా మహమ్మద్ ఖురేషీ గతవారం లేఖరాశారు. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటేరస్ స్పందిస్తూ కశ్మీర్‌పై భారత్, పాకిస్థాన్ నిగ్రహం పాటించాలని ఇప్పటికే సూచించారు. దీనిపై మూడోపక్షం జోక్యానికి అవకాశం లేదని, సిమ్లా ఒప్పందం ప్రాతిపదికన ముందుకెళ్లాలని పేర్కొన్నారు. పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ స్పందిస్తూ కశ్మీర్ అంశంపై ఐరాస భద్రతామండలి సమావేశమైతే.. నాలుగు దశాబ్దాల తర్వాత తాము దౌత్యపరంగా సాధించిన గొప్ప విజయమవుతుందని చెప్పారని పాక్ మీడియా పేర్కొంది. గతవారం చైనాలో పర్యటించిన ఖురేషి.. కశ్మీర్ అంశంపై భద్రతామండలిలో చైనా తమకు మద్దతు పలుకుతుందని, దీనిపై న్యూయార్క్‌లో పాక్ ప్రతినిధితో అనుసంధానం కావాలని చైనా తన ప్రతినిధులను ఆదేశించిందన్నారు. దీనిపై సంప్రదింపులకు పాక్, చైనా డైరెక్టర్ జనరల్ స్థాయిలో అధికారులను నియమించినట్లు తెలిపారు. 


ఇదిలాఉండ‌గా,  సోమవారం చైనాలో పర్యటించిన భారత్ విదేశాంగమంత్రి జైశంకర్.. ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ ఈతో జరిగిన సమావేశంలో కశ్మీర్ అంశం తమ అంతర్గత వ్యవహారమని తేల్చిచెప్పారు. ప్రత్యేక ప్రతిపత్తి రద్దుచేయడం వల్ల సరిహద్దుల్లో నియంత్రణ రేఖ (ఎల్వోసీ)పై ప్రభావం ఉండబోదన్నారు. కాగా, కశ్మీర్‌పై 1965లో చివరిసారిగా ఐరాస భద్రతామండలి పూర్తిస్థాయి సమావేశం జరిగింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: