ఏపీకి తొలిసారి సీఎం అయిన జగన్ మోహన్ రెడ్డి, అధికార పీఠం అధిరోహించిన దగ్గర నుంచి దూకుడుగా పాలన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. నవరత్నాలు అమలు చేస్తూనే, పాలనలో పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకుగాను గత రెండు నెలలుగా అన్నీ శాఖలని సమీక్షించారు. అలాగే గత ప్రభుత్వ అవినీతి విధానాలని వెలికితీసేందుకు కొన్ని కఠిన నిర్ణయాలని కూడా తీసుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు ఏం చేసిన సచివాలయానికే పరిమితమైన జగన్ సెప్టెంబర్ నుంచి దూకుడు పెంచి జనంలోకి వెళ్లనున్నారు.


తాను తీసుకున్న నిర్ణయాలని జనానికి నేరుగా వివరించే ప్రయత్నం చేయనున్నారు. తన తండ్రి దివంగత నేత వైఎస్సార్ చేపట్టిన రచ్చబండ కార్యక్రమాన్ని కొనసాగించాలని అనుకుంటున్నారు. వైఎస్సార్ రచ్చబండ కార్యక్రమానికి వెళుతూనే ప్రమాదానికి గురై మృతి చెందిన విషయం తెల్సిందే. ఇప్పుడు అదే కార్యక్రమాన్ని వైఎస్సార్ ప్రారంభించాలనుకున్న అదే చిత్తూరు నుంచి మొదలుపెట్టాలని అనుకుంటున్నారు. ఈ మేరకు రాష్ట్రంలో ఆయా జిల్లాల కలెక్టర్లకు, పార్టీ నేతలకు ఆదేశాలు అందాయి.


ఇక జగన్ పర్యటనకి వెళ్ళేలోపే కొన్ని సంక్షేమ కార్యక్రమాలని ప్రవేశ పెట్టాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోంది. అందులో సెప్టెంబరు 1వ తేదీ నుంచి సన్న బియ్యం, పింఛన్లను డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించారు. అలాగే ప్యాకింగ్ చేసిన సన్న బియ్యాన్ని శ్రీకాకుళం నుంచి పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తారు. అటు ఆరోగ్యశ్రీని కూడా అమలు చేయనున్నారు. 


ఇక కొంత కేంద్రం సహకారంతో ఇచ్చే రైతు భరోసా పథకాన్ని అక్టోబరు 15వ తేదీన ప్రధాని మోడీతో ప్రారంభించాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు. ఉగాది నాటికి అర్హులైన వారందరికి ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ పూర్తి చేయాలని చూస్తున్నారు. మొత్తం మీద క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకునేందుకు జగన్ వచ్చే నెల నుంచి ప్రజల్లోకి వెళ్లనున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: