కేబినెట్ విస్తరణకు ఎట్టకేలకు బీజేపీ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యడియూరప్ప సీఎం అయి నెలరోజులౌతున్నా.. మంత్రివర్గాన్ని ఏర్పాటుచేయలేదు. ముఖ్యమంత్రి వన్ మ్యాన్ షో చేస్తున్నారని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న తరుణంలో.. కేబినెట్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. 

కర్ణాటక మంత్రివర్గ విస్తరణపై చర్చించేందుకు సీఎం యడియూరప్ప బీజేపీ అధిష్టానాన్ని కలువబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, హోంమంత్రి అమిత్‌షా, వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డాతో చర్చలు జరుపుతున్నారు బీజేపీ ప్రభుత్వం ఏర్పడి రోజులు దాటుతున్నా ఇంతవరకు మంత్రివర్గం ఏర్పాటు కాకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎట్టకేలకు ముహూర్తం ఖరారు కావడంతో ఆశావహులు తీవ్ర లాబీయింగ్‌ చేస్తున్నారు. తొలిదశలో 10 నుంచి 12 మందికి యడియూరప్ప మంత్రివర్గంలో అవకాశం దక్కుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. 

యడియూరప్ప ప్రభుత్వ ఏర్పాటుకు పరోక్షంగా సహకరించిన 17మంది అనర్హ ఎమ్మెల్యేల విషయం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. వీరికోసం కొన్ని మంత్రి పదవులను ఖాళీగా ఉంచే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మంత్రులయ్యేది వీళ్లేనంటూ ఓ జాబితా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తొలిదశలో మైనారిటీలకు కేబినెట్‌లో అవకాశం ఉండకపోవచ్చునని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, కురుబ, ఒక్కలిగ, లింగాయత్‌ కులాలకు కేబినెట్‌లో అధిక ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. మంత్రివర్గ విస్తరణపై ఇప్పటికే బాగా ఆలస్యం జరగడంతో.. ఇక ఆలస్యం చేయొద్దని ఆర్.ఎస్.ఎస్ నుంచి కూడా సూచన వచ్చింది. 

అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ నెల 19న మంత్రివర్గ విస్తరణ ఖాయంగా ఉంటుందని బీజేపీ వర్గాలు స్పష్టం చేశాయి. ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి అధిష్ఠానం తరపున ప్రముఖ నేతలు ఎవరూ హాజరు కాలేదు. అయితే ఈసారి విస్తరణకు ఒకరిద్దరు ప్రముఖ నేతలు వచ్చే అవకాశం ఉంది. చూడాలి యడియూరప్ప తన మంత్రివర్గంలోకి ఎవరెవరిని తీసుకుంటారో.. 





మరింత సమాచారం తెలుసుకోండి: