తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కొత్తగూడెం జిల్లాలో కీలక నేత,  ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. ఈ నెల 18న హైదరాబాద్‌లోని బీజేపీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ జెపీ లడ్డా సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. అలాగే నియోజకవర్గంలో పలు కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీలో చేరనున్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే ప్రభుత్వం ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని అబ్బయ్య అన్నారు.


రానున్న కాలంలో రాష్ట్రంలో బీజేపీదే అధికారమని ఆ దిశంగా ప్రజలు, నాయకులు చూస్తున్నారని తెలిపారు. దేశంలో నరేంద్ర మోదీ పాలనలో సుస్థిరపాలన అందిస్తున్నారని, రాష్ట్రంలోనూ సుస్థిర పాలన కోరకుంటున్నారని అన్నారు. ఇక ఎన్నికలు జరిగి ఎనిమిది నెలలు కావస్తున్నా సీఎం కేసీఆర్‌ అభివృద్ధి కోసం పైసా నిధులు కేటాయించలేదని తెలిపారు. అసలు ప్రజల వద్దకు రాకుండా వారి కష్టాలు ఎలా తెలుస్తాయని కేసీఆర్ ని ప్రశ్నించారు. 


ఇక సీతారామ ప్రాజెక్ట్‌ శంకుస్థాపన జరిగి ఏళ్లు గడుస్తున్నా పనులు ప్రారంభం కాలేదని, ఉక్కు పరిశ్రమ, గిరిజన యూనివర్సీటీ అడ్రస్‌ లేదని, భూగర్భ గనులు, బొగ్గు నిక్షేపాల వెలికితీతలో కేసీఆర్‌ మాటలు నీటి మూటలుగా మారాయన్నారు. ఊకే అబ్బ‌య్య గ‌తంలో టీడీపీ నుంచి ప‌లుసార్లు ఇల్లెందు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న టీడీపీ ఎమ్మెల్యేగానే గెలిచారు. 2014 ఎన్నిక‌ల్లో ఓడిపోయిన అనంత‌రం ఆయ‌న కాంగ్రెస్‌లో చేరారు. 


ఇక కాంగ్రెస్ నుంచి గెలిచిన కోరం క‌న‌క‌య్య ఆ త‌ర్వాత టీఆర్ఎస్‌లో చేర‌డం.. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ బాణోత్ హ‌రిప్రియ కూడా కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్‌లో చేర‌డంతో ఇల్లెందులో కాంగ్రెస్ బాగా వీక్ అయ్యింది. కాగా, కొత్తగూడెం జిల్లా నుంచి టీడీపీ ప్రధాన నాయకుడు కోనేరు సత్యనారాయణ కూడా బీజేపీలో చేరుతున్న విషయం తెలిసిందే. ఈ జిల్లాలో చాలామంది కాంగ్రెస్, టీడీపీ నేతలు కూడా బీజేపీలోకి వెళ్ళేందుకు సిద్ధమయ్యారు. మొత్తానికి రాష్ట్రంలో కాంగ్రెస్ ఇంకా వీక్ అయ్యి  బీజేపీ బలపడే దిశగా వెళుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: