ఆంధ్రప్రదేశ్ లో  విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి.  ఒకవైపు వరదలతో అతలాకుతలం అవుతుంటే మరొకవైపు కరువుతో ప్రజలు  అల్లాడుతున్నారు.  ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టడం వల్లే వరుణుడు కరుణించి సాగునీటి ప్రాజెక్టులు నిండాయని వైకాపా నేతలు అంటుంటే , మరి రాయలసీమ జిల్లాలు ఏమి అన్యాయం చేశాయని వరుణుడు కరుణించలేదని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు . గతం లో వైఎస్ అధికారం లో ఉన్నప్పుడు ఇదే తరహా లో సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగా నిండగా, ఇప్పుడు మరొకసారి అదే పరిస్థితి కన్పిస్తోంది . అయితే ఈసారి కాసింత భిన్నమైన పరిస్థితులు రాష్ట్రం లో నెలకొన్నాయి . 


   ఎగువ  రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణ,  గోదావరి నదులు  ఉప్పొంగి ప్రవహిస్తూ ఉం టే,  రాయలసీమ జిల్లాల్లో మాత్రం తాగడానికి నీళ్లు  లేక స్థానికులు అల్లాడుతున్నారు. ప్రధానంగా  కడప , అనంతపురం జిల్లాల్లో తాగునీటికి స్థానికులు కట, కటలాడాల్సిన పరిస్థితి నెలకొంది. స్థానికులు దాహార్తి తీర్చుకునేందుకు కిలోమీటర్ల దూరం వెళ్లి మంచినీటి తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది .  ఈ  రెండు జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే తక్కువ నమోదు కావడం దీనికి కారణమని తెలుస్తోంది . దీని వల్ల పంటలతో పాటు,  బావులు,  బోర్లు, చెరువులు ఎండిపోయి చాలాచోట్ల విత్తనాలు వేసు కోలేని పరిస్థితి  నెలకొంది. వర్షాభావ పరిస్థితుల నేపధ్యం లో వ్యవసాయ  పనులు లేకపోవడంతో అనంతపురం,  కడప  జిల్లాలకు చెందిన రైతులు,  రైతు కూలీలు ఉపాధి పనుల కోసం బెంగళూరు,  హైదరాబాద్ ,  బళ్లారి  నగరాలకు వలస  వెళ్తున్నారు.


  అయితే కడప,  అనంతపురం తో పోలిస్తే కర్నూలు చిత్తూరు జిల్లాలో సాగు పరిస్థితులు ఒకింత బాగానే ఉన్నాయని స్థానికులు అంటున్నారు. కడప , అనంత లో నెలకొన్న దుర్భిక్ష  పరిస్థితుల నేపధ్యం లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు . కాలువల ద్వారా కడప , అనంతపురం జిల్లాలకు వరద నీరును మళ్లించేందుకు చర్యలు తీసుకుని స్థానికుల్ని ఆదుకునే ప్రయత్నాలు చేయాలని కోరుతున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: