రెండు వారాల క్రితం వివాదాస్పద ట్రిపుల్ తలాక్ బిల్లును పార్లమెంట్ ఆమోదించిన విషయం తెలిసిందే. పార్లమెంట్ లో బిల్లు ఆమోదం పొందిన తరువాత మూడుసార్లు తలాక్ అంటూ భార్యకు విడాకులు ఇచ్చిన వ్యక్తిని కేరళ పోలీసులు అరెస్ట్ చేసారు. బిల్లు ఆమోదం పొందిన తరువాత అరెస్ట్ అయిన మొదటి వ్యక్తి ఇతనేనని భావిస్తున్నామని పోలీసులు చెప్పారు. కోజికడ్ అనే ప్రాంతానికి చెందిన ఈ. కె. ఇస్సామ్ అనే వ్యక్తి తన భార్యకు మూడు సార్లు తలాక్ చెప్పి విడాకులు ఇచ్చి భార్యను వదిలించుకోవాలని చూసాడనేది ప్రధాన ఆరోపణగా ఇతనిపై కేసు నమోదైంది 
 
ఈ. కె. ఇస్సామ్ ను ముస్లిం మహిళా బిల్లు (వివాహ హక్కుల పరిరక్షణ) 2019 ప్రకారం అరెస్ట్ చేసినట్లు సమాచారం. భర్త ట్రిపుల్ తలాక్ చెప్పాడని భార్య పోలీసులను ఆశ్రయించటంతో ఈ కేసు నమోదైంది. అరెస్ట్ చేసిన తరువాత ఈ వ్యక్తిని తమర్ సెర్రి కోర్ట్ ఎదుట పోలీసులు హాజరు పరిచారు. ప్రస్తుతం ఈ. కె. ఇస్సామ్ బెయిల్ పై ఉన్నాడు. వివాహం అనంతరం ఇస్సామ్ తన భార్యను గల్ఫ్ ప్రాంతానికి తీసుకొనివెళ్ళాడు. 
 
గల్ఫ్ ప్రాంతానికి తీసుకొనివెళ్ళిన తరువాత మొదట్లో బాగానే ఉన్నా ఆ తరువాత ఆమెను తరచూ వేధించటం మొదలుపెట్టాడు. అలా కొంతకాలం పాటు భార్యను చిత్ర హింసలు పెట్టిన ఇస్సామ్ ఆ తరువాత భార్యతో కలిసి భారత్ కు వచ్చి ఈ నెల ప్రారంభంలో వెంట వెంటనే భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు. ఆ తరువాత ఇస్సామ్ మరో మహిళను వివాహం చేసుకున్నాడు. భాదితురాలికి చెందిన నగదు, బంగారం ఇస్సామ్ వద్దే ఉందని, ఆమెకు ఇవ్వాల్సిన భరణం కూడా ఇవ్వలేదని ఇస్సామ్ భార్య తరపు న్యాయవాది అన్వర్ సిధ్ధిక్ తెలిపారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: