స్వాతంత్ర్య దినోత్స‌వం నాడు ఉత్త‌మ కానిస్టేబుల్‌...ఆ మ‌రుస‌టి రోజే అవినీతిలో దొరికిపోయాడు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం చింతలదిన్నె గ్రామానికి చెందిన కానిస్టేబుల్ తిరుపతిరెడ్డి ఇలా ఘ‌న‌కార్యానికి పాల్ప‌డ్డాడు. ఇసుక తరలిస్తున్నావంటూ ట్రాక్టర్ యజమాని నుంచి లంచం తీసుకుంటున్న వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఐడీ పార్టీ కానిస్టేబుల్ తిరుపతిరెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.


ఏసీబీ డీఎస్పీ కృష్ణాగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ మండలం, వెంకటాపూర్ గ్రామానికి చెందిన ముడావత్ రమేశ్‌ను కానిస్టేబుల్ తిరుపతిరెడ్డి ఇసుక ట్రాక్టర్ విషయంలో లంచం రూ.17 వేలు ఇవ్వాలని, లేదంటే ట్రాక్టర్ సీజ్ చేస్తానని బెదిరించాడు. రూ. 17,000 ఇస్తేనే ట్రాక్టరును విడిచిపెడతానని చెప్పాడు. కాదు.. కూడదంటే తప్పుడు కేసులను బనాయిస్తానని బెదిరించాడు. తిరుపతిరెడ్డి వైఖరితో విసిగిపోయిన రమేశ్‌ ఏసీబీ అధికారులను సంప్రదించడంతో వారు వలపన్నారు. శుక్రవారం ఏసీబీ అధికారులు రూ.17 వేలు బాధితునికి ఇచ్చి కానిస్టేబుల్‌కు ఇవ్వాలని చెప్పారు. కానిస్టేబుల్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ కృష్ణాగౌడ్, మరో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు పట్టుకున్నారు. 


 కాగా, తిరుపతిరెడ్డి గురువారం జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్, జిల్లా కలెక్టర్, ఎస్పీల చేతుల మీదుగా ఉత్తమ సేవా అవార్డు అందుకున్నాడు. ఇది గడిచి 24 గంటలు కాకముందే ఏసీబీకి చిక్కడం చర్చనీయాంశంగా మారింది. నిబంధనలకు అనుగుణంగానే ఇసుక సరఫరా చేస్తున్నప్పటికీ లంచాల పేరుతో వేధించడంతో విసిగి ఏసీబీ అధికారులను ఆశ్రయించానని తెలిపారు. మరి ఇలాంటి కానిస్టేబుల్‌ని ‘ఉత్తమ’ అవార్డుకు ఎలా ఎంపిక చేశారా? అని జనం అవాక్కవుతున్నారు. ఉత్తమ అవార్డుల ఎంపికలో చిత్తశుద్ధినే శంకిస్తున్నారు. ఇదిలాఉండ‌గా, ఇంతకుముందే జిల్లా కేంద్రంలోని టూటౌన్ పోలీస్టేషన్లో డ్యూటీ చేస్తున్నప్పుడు కొందరి అండతో ఇసుక మాఫియా , ఇతర కేసుల్లో డీల్స్ చేసేవాడన్న ఆరోపణలు ఉన్నాయని ప్ర‌చారం జ‌రుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: