ఏపీ రాజకీయాల్లో బీజేపీ వేలు బాగానే పెడుతోంది. అయిదేళ్ళుగా ఖాళీగా ఉన్న గవర్నర్ పోస్ట్ ని భర్తీ చేయడంలోనే బీజేపీ ఆంతర్యం బయటపడింది. ఇక గవర్నర్ గా కూడా అలాటి ఇలాంటి వారిని కాదు కరడు కట్టిన బీజేపీ మనిషిని నియమించారు. గవర్నర్ కూడా రాజ్ భవన్ కి పరిమితం కాకుండా ప్రజా  సందర్శనలు బాగా చేస్తున్నారు.  వరసగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో తనిఖీలు చేస్తున్నారు.


ఇదిలా ఉండగా సాధారణ పరిపాలనా పరమైన విషయాల్లో గవర్నర్ల పాత్ర చాలా తక్కువగా ఉంటుంది. వారు ముఖ్యమంత్రి ద్వారానే ప్రతి విషయం మీదా సమాచారాన్ని తెప్పించుకుంటారు. అయితే హరిచందన్ నియామకం జరిగి నిండా నెల రోజులు కాలేదు కానీ ఆయన మాత్రం ఓ పద్ధతి ప్రకారం తన విధులను చేసుకునిపోతున్నారు. ఈ మధ్యనే ఢిల్లీ వెళ్ళి ప్రధాని తో సహా బీజేపీ పెద్దలను ఆయన కలిశారు. మరక్కడ ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ గవర్నర్ బాగానే యాక్టివ్ అవుతున్నారు.


ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ రోజు గవర్నర్ ఏరియల్ సర్వేను చేయడం పెద్ద చర్చగా మారింది. సాధారణంగా రాష్ట్రపతి పాలన ఉన్న రాష్ట్రాల్లోనే గవర్నర్లు ఇలా  చురుకుగా వుంటారు.  వరదలు కనుక వస్తే  ఏరియల్ సర్వేలు చేసి జనంలోకి వెళ్తారు. ఏపీలో చూస్తే బంపర్ మెజారిటీతో గెలిచిన వైసీపీ సర్కార్ ఉంది. అయినా గవర్నర్ పనిగట్టుకుని ఏరియర్ సర్వే చేయడంపైన చర్చ సాగుతోంది. గవర్నర్ ప్రధమ పౌరుడు ఏరియల్ సర్వే చేయవచ్చు, మరేమైనా చేయవచ్చు,  కానీ మంత్రులు, అధికారులు, వ్యవస్థ బాగానే పని చేస్తున్న‌ చోట ఆయన యాక్టివ్ రోల్ ప్లే చేయడం గమనార్హం.


ఇదిలా ఉంటే ఏపీలో వరదలు వస్తే చక్కదిద్దే విషయంలో వైసీపీ సర్కార్ ఘోరంగా ఫెయిల్ అయిందని బీజేపీ ఎంపీ సుజన చౌదరి విమర్శించారు. విశాఖలో ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎగువ రాష్ట్రాల  నుంచి వరద నీరు భారీగా వస్తుందన్న సమాచారం దగ్గర ఉంచుకుని కూడా ప్రభుత్వం అప్రమత్తం కాలేకపోయిందని నిందించారు. ఇక వరద నష్టం వంటి విషయాలపైన తాము గవర్నర్ నుంచి నివేదిక తెప్పించుకుంటామని సుజనాచౌదరి అనడం విశేషం.  మరి ముఖ్యమంత్రి జగన్ నుంచి నివేదిక తీసుకోరా, అందుకేనా గవర్నర్ ఏరియల్ సర్వే చేసింది అన్న ప్రశ్నలు వెంటనే ఉత్పన్నం అవుతున్నాయి. ఏది ఏమమైనా గవర్నర్ హరిచందన్ ఏరియల్ సర్వే చేయడం, సుజనా కామెంట్స్, జగన్ విదేశాల్లో ఉండడం వంటివి చూస్తే కొత్త డౌట్లు ఏవేవో కలుగుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: