ఏపీలో పారదర్శక పాలన ఉందని, పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని జగన్ స్పష్టం చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి.. వ్యవసాయం, పోర్టులు వంటి రంగాల్లో పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అమెరికా దౌత్యాధికారులతో భేటీ అయిన జగన్.. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు వివరించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి యూఎస్‌ విదేశాంగ శాఖ అధికారులతో సమావేశమయ్యారు.  హైదరాబాద్‌లో యూఎస్‌ కాన్సులేట్‌ కొత్త జనరల్‌ జోయల్‌ రిచర్డ్‌తో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. అనంతరం మధ్య, దక్షిణాసియా వ్యవహారాల ఉప మంత్రి థామస్‌ వాజ్దాతో సీఎం జగన్‌ భేటీ అయ్యారు. ప్రభుత్వ వ్యవహారాల డైరెక్టర్‌ క్లాడియా లిలైన్‌ఫీల్డ్‌తో సీఎం చర్చలు జరిపారు.

గ్లోబల్‌ సస్టైనబిలిటీ వైస్‌ ప్రెసిడెంట్‌ క్లేనెస్లర్‌తోనూ భేటీ అయి రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు. సోలార్‌ పవర్,  ఉపకరణాల తయారీలో ప్రముఖ సంస్థ అయిన జాన్స్‌ కంట్రోల్స్‌ ప్రతినిధులతో ముఖ్యమంత్రి జగన్‌ చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో స్మార్ట్‌ సిటీ నిర్మాణంలో సహకారం అందిస్తామని జాన్సన్‌ కంట్రోల్స్‌ ప్రతినిధులు చెప్పారు. పట్టణాభివృద్ధి, జల నిర్వహణలో సహకారం అందించేందుకు సిద్ధమని జీలీడ్‌ సైస్సెస్‌ వెల్లడించింది. వ్యవసాయ పరిశోధనలో ఏపీకి సహకరిస్తామని జీలీడ్‌ సైన్సెస్‌ సభ్యులు పేర్కొన్నారు. ఏపీకి పొడవైన సముద్ర తీరం ఉందని, డీశాలినేషన్, బకింగ్ హామ్ కెనాల్ ఆధునీకరణ లాంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు జగన్. 

డల్లాస్ లో ఉన్న జగన్.. రేపు తెల్లవారుజామున  కే బెయిలీ హచిన్సన్‌ కన్వెన్షన్‌ సెంటర్లో జరిగే సభకు హాజరవుతారు. నార్త్‌ అమెరికాలో తెలుగు వాళ్లను ఉద్దేశించి ప్రసంగిస్తారు. వాషింగ్టన్‌ చేరుకొని.. వ్యాపార సంస్థల ప్రతినిధులతో చర్చలు జరుపుతారు. ఆగస్టు 19, 20, 21న తన వ్యక్తిగత పనులతో ముఖ్యమంత్రి బిజీగా గడపనున్నారు. ఆగస్టు 22న మధ్యాహ్నం షికాగోలో మరికొన్ని సంస్థల ప్రతినిధులను కలుస్తారు.. తర్వాత అదే రోజు రాత్రి 8:30 గంటలకు అమెరికా నుంచి రాష్ట్రానికి తిరిగి బయల్దేరతారు. 






మరింత సమాచారం తెలుసుకోండి: