ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల విధానాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలని విద్యాశాఖ భావిస్తంది. పలు కీలక అంశాల్లో మార్పులు చేయాలని ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇప్పటి వరకూ పదో తరగతిలో 20 శాతం మార్కులు ఇంటర్నల్ మార్కులు ఉండేవి. ఇప్పుడు వీటిని రద్దు చేసే ఆలోచన చేస్తోంది. అంటే ఈ విధానాన్నికి ప్రభుత్వం పచ్చజెండా ఊపితే ఇక ప్రశ్నాపత్రం పూర్తిగా 100 మార్కులకు ఉంటుందన్నమాట.


మరో కీలకమైన మార్పు ఏంటంటే.. బిట్ పేపర్ ను పూర్తిగా రద్దు చేస్తారట. వాటి బదులు సింగిల్ సెంటెన్స్ ప్రశ్నలు ఉంటాయట. అంతే కాదు ఒక సబ్జక్టుకు 100 మార్కులకు ఒకే పేపర్ కాకుండా... 50 మార్కుల పేపర్లు రెండు ఉంటాయట. ఈ రెండింటిలోనూ పాస్ కావాల్సిందేనట. ఇప్పటికే ఇంటర్నల్ మార్కులను రద్దు చేస్తూ ప్రభుత్వం జూలై 16న జీవో కూడా ఇచ్చేసింది.


బిట్ పేపర్ల కారణంగా కాపీయింగ్ బాగా జరుగుతోందని ఫిర్యాదులు ఉన్నాయి. ప్రత్యేకించి ప్రైవేటు స్కూళ్లు, కార్పొరేట్ స్కూళ్లు ఈ బిట్ పేపర్ మొత్తం విద్యార్థులకు చెప్పేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ బిట్ పేపర్ కాపీయింగ్ కూడా చాలా సులభం.. అందుకే దీన్ని రద్దు చేయాలని భావిస్తున్నారు. ఇప్పటి వరకూ బిట్ పేపర్ విడిగా ఇస్తున్నారు. కానీ ఇకపై బిట్ పేపర్ స్థానం లో వచ్చే సింగిల్ సెంటెన్స్ ప్రశ్నలను కూడా మెయిన్ పేపర్ లోనే ఇస్తారు.


ప్రశ్నాపత్రం మోడల్ మారుతున్నందు వల్ల పరీక్షల సమయం కూడా పెరిగే అవకాశం ఉంది. హిందీ లేదా సంస్కృతం మినహాయించి మిగిలిన సబ్జెక్టుల్లో ప్రతి పేపర్‌కు 2.30 గంటలు పరీక్ష రాయడానికి, 15 నిమిషాలు ప్రశ్నపత్రం చదువుకోవడానికి సమయం ఉంటుంది. హిందీ లేదా సంస్కృతం ఇక 100 మార్కులకు ఉంటాయి కాబట్టి పరీక్ష రాయడానికి 3 గంటలు, ప్రశ్నపత్రం చదువుకోవడానికి 15 నిమిషాలు సమయం ఇస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: