తెలుగు రాష్ట్రాలకు కృష్ణా నీళ్లు రావాలంటే పైన ఉన్న కర్ణాటక రాష్ట్రం దాటుకుని రావాలి. ఎగువ నుంచి వచ్చే నీళ్లను కర్ణాటక కట్టడి చేసేస్తోంది. ఇప్పటికే పైన అనేక అక్రమ ప్రాజెక్టుల కట్టడాలతో ఏపీలోకి నీళ్లు రాకుండా ఆగిపోతున్నాయి. ఏపీలో కృష్ణా నది పరివాహక ప్రాంతం మరీ ఘోరంగా తయారైంది. ఎగువన తట్టుకోలేనంత వరద వస్తేనే విజయవాడ బ్యారేజ్ వరకూ నీరొచ్చేది. ఏపీలో 2009 లో నిండిన కృష్ణా నది ప్రాజెక్టులు మళ్లీ 2019లో నిండటమే ఇందుకు ఉదాహరణ.


 

కృష్ణా నీళ్లను అల్మట్టీ డ్యాం ద్వారా తెలుగు రాష్ట్రాలకు ఎప్పుడో మట్టి కొట్టేసింది కర్ణాటక. ఇప్పుడు కొత్తగా తుంగభద్ర ప్రాజెక్టు పరిధిలో అక్కడి ‘నౌలీ’ వద్ద రిజర్వాయర్ కోసం తాజాగా జరిగిన తుంగభద్ర బోర్డు సమావేశంలో ఆ రాష్ట్రం ప్రతిపాదన తెచ్చింది. తుంగభద్రలో తమ వాటా 230 టీఎంసీలకు ఇప్పటికి 130 మాత్రమే వాడుకుంటున్నామని పూర్తి సద్వినియోగం కోసం 40 టీఎంసీల నీటి వాడకం కోసం ఈ ప్రాజెక్టుకు అనుమతివ్వాలని బోర్డును కోరుతోంది కర్ణాటక. ఇప్పటికే 40 అక్రమ ఎత్తిపోతల పథకాల ద్వారా, తూముల ద్వారా 5 టీఎంసీల నీటిని వాడుకుంటూ కూడా మళ్లీ నౌలీ రిజర్వాయర్ ప్రతిపాదన తెస్తోంది కర్ణాటక. ఇదే జరిగితే ఇక తమకు నీళ్లొచ్చేది లేదంటూ, దీనిపై రెండు తెలుగురాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. దీంతో బోర్డు సమావేశం రద్దు చేశారు.

 


గోదావరిపై కూడా మహారాష్ట్ర, ఒడిషాలు డ్యాంలు, ప్రాజెక్టులు కట్టాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నా.. అనుమతుల రూపంలో వారికి అడ్డంకులున్నాయి కాబట్టి గోదావరి నీళ్లు ప్రతి ఏటా ధవళేశ్వరం వరకూ వస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు ద్వారా రావల్సిన ప్రవాహం కొద్దిగా తగ్గింది. నీటి విషయంలో ఏపీకి జరుగుతున్న అన్యాయంపై రాష్ట్రాలు, బోర్డులు ఖచ్చితంగా వ్యవహరించాల్సిన అవసరముంది.


మరింత సమాచారం తెలుసుకోండి: