కొన్ని సంవత్సరాల ముందు వరకు ఆకలేస్తే ఏదైనా హోటల్ కెళ్ళి తినాలి. లేదంటే హోటల్ నుండి పార్శిల్ తెచ్చుకోవాలి. కొత్త ప్రదేశాలకు వెళ్ళామంటే అక్కడ ఏ హోటల్ బెస్ట్ అనే విషయం తెలిసే అవకాశమే ఉండదు. కానీ ఇప్పుడు ఆప్ ఓపెన్ చేస్తే చాలు మనకు దగ్గరలో ఉన్న హోటళ్ళు, రెస్టారెంట్లు అక్కడ  దొరికే ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఆన్ లైన్లో కనిపిస్తాయి. మనకు నచ్చిన ఫుడ్ ఐటమ్స్ ఇంటికే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఫుడ్ టేస్ట్ చేసిన కస్టమర్స్ ఇచ్చే రివ్యూల ఆధారంగా ఏ హోటల్ లో ఏ ఫుడ్ ఐటమ్స్ బాగుంటాయో తెలుసుకోవచ్చు. 
 
ఇలాంటి మార్పు రావటానికి కారణమైన సంస్థల్లో జొమాటో ఒకటి. జొమాటో కంపెనీ ఎలా ప్రారంభమైందో ఆహర రంగంలో ఒక విప్లవాన్నే ఎలా తెచ్చిందో చెప్పారు జొమాటో సంస్థ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్. ఐఐటీ ఢిల్లీలో బీటెక్ పూర్తి చేసిన దీపిందర్ గోయల్ బెయిన్ అండ్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. అక్కడ పంకజ్ చద్దా అతనికి సహోద్యోగిగా ఉండేవాడు. ఆఫీస్ క్యాంటీన్లో మెనూ కార్డులు తగినన్ని లేకపోవటంతో మెనూ కార్డులను స్కాన్ చేసి ఇంట్రానెట్లో పెట్టారు దీపిందర్ గోయల్ మరియు పంకజ్. 
 
ఆ తరువాత దీపిందర్ మరియు పంకజ్ సొంత వ్యాపారం చేయాలనే ఆలోచనతో ఇద్దరూ  కలిసి ఢిల్లీలోని వివిధ రెస్టారెంట్ల మెనూ కార్డులను స్కాన్ చేసి ఒక వెబ్ సైట్ రూపొందించారు. ఆ వెబ్ సైట్లో రెస్టారెంట్ల ఫోన్ నెంబర్లు కూడా ఉంచారు. 2008లో ప్రారంభమైన ఆ వెబ్ సైట్ కు ఫూడీ బే అని పేరు పెట్టారు. వెబ్ సైట్ వీక్షించిన వారి నుండి రెస్టారెంట్లకు ఆర్డర్లు ఎక్కువగా రావటంతో రెస్టారెంట్లు వెబ్ సైట్లో ప్రకటనలు కూడా ఇచ్చాయి. 
 
ఆరు నెలల తరువాత ఇన్ఫోఎడ్జ్ అనే కంపెనీ 70 లక్షలు పెట్టుబడి పెట్టటంతో వీరిద్దరి జీవితాలు పూర్తిగా మారిపోయాయి. ఆ తరువాత కొన్ని కారణాల వలన "ఫూడీబే " పేరును "జొమాటో" గా మార్చారు. ఆహార విభాగంలో మొట్టమొదట ఇండియాలో ప్రారంభమైన అప్లికేషన్ జొమాటో. ప్రస్తుతం జొమాటో 23 దేశాలకు విస్తరించింది. ఆకలేస్తే అమ్మ కాదు జొమాటో గుర్తుకురావాలని దీపీందర్ గోయల్ అన్నారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: