తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవ‌ల కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన సంగ‌తి గుర్తుండే ఉంటుంది. తమిళనాడులోని కాంచీపురంలో అత్తివరదరాజస్వామి వారిని దర్శించుకునేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ రేణిగుంట విమానాశ్ర‌యం చేరుకొని అక్క‌డి నుంచి కంచికి రోడ్డు మార్గ‌న వెళ్లిన సంగ‌తి తెలిసిందే. కేసీఆర్‌ వెంట ఆయన సతీమణి శోభ, కుమార్తె, మాజీ ఎంపీ కవితతో పాటు ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌ రోజాతో పాటు పలువురు నేతలు కూడా స్వామిని దర్శించుకున్నారు. అనంత‌రం ఆయ‌న రోజా ఇంట్లో భోజ‌నం చేసిన త‌దుప‌రి తిరుమ‌ల బాలాజీని ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ, రాయలసీమ అభివృద్ది కోసం ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో కలిసి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు . అంతేకాకుండా రాయలసీమను రతనాలసీమగా చేసేందుకు తమ వంతుసాయం చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. ఈ ప్ర‌క‌ట‌న రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీనిపై ఆయా పార్టీల నేత‌లు స్పందిస్తున్నారు. 

అయితే, తాజాగా కేసీఆర్ కామెంట్ల‌పై  టీజేఎస్​ అధ్యక్షుడు ప్రొఫెసర్​ కోదండరాం ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. హైదరాబాద్​లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కొట్లాడి, బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణలోని నీటిని ఎలా దానం చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ఎడారిగా మార్చాలన్న ఆలోచనను తాము ఒప్పుకోబోమన్నారు. రాష్ట్రంలోని నీటి వనరులను రాయలసీమకు తరలిస్తే ఊరుకునేది లేదని ప్ర‌క‌టించారు. నదుల అనుసంధానం పేరుతో కేసీఆర్​ చేస్తున్న రాజకీయ డ్రామా, అవినీతిపై మరో పోరాటం చేస్తామన్నారు. కృష్ణా, గోదావరి అనుసంధానం మూర్ఖపు ఆలోచన అని, దాని వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందని ప్ర‌క‌టించారు.


ఇదిలాఉండ‌గా, ఇప్ప‌టికే ఈ అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ సెటైర్లు వేసిన సంగ‌తి తెలిసిందే. ``కన్నతల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానన్నడట.. సింగూరు, నిజాం సాగర్ లకు చుక్కనీరు రాకుండా తెలంగాణ భూములు బీడు పారుతుంటే పట్టించుకోరు.. కానీ రాయలసీమను మాత్రం రతనాలసీమగా మారుస్తారట" అంటూ ఎద్దేవా చేశారు. ఈ మేర‌కు ఓ ట్వీట్లో ఆయ‌న స్పందించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: