తాజా సార్వత్ర ఎన్నికల్లో ఘోర ఓటమి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ టిడిపికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తెలంగాణలో అన్ని జిల్లాల నుంచి పలువురు కీలక నేతలు బిజెపిలో చేరుతుండడంతో ఆదివారంతో తెలంగాణలో ఆ పార్టీ చరిత్ర గత చరిత్రే అన్నట్లుగా ఉండ‌నుందని రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇకపై తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పేరు కూడా తలిచే ప్రముఖ నేతలు కనపడ‌ని పరిస్థితి.


ఇప్పుడు ఏపీలోనూ ఆ పార్టీకి దిమ్మ తిరిగే షాక్ తగ‌ల‌నుంది. నలుగురు రాజ్యసభ సభ్యులతో పాటు పలువురు కీల‌క  నేతలు బిజెపిలో చేర‌గా.. తాజాగా ఆ పార్టీ అధికార ప్రతినిధి యామిని సాధినేని కూడా పార్టీ వీడేందుకు  సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను యామిని కలిసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఆమె బీజేపీలో చేరనున్నారనే వార్తలకు మరింత బలం చేకూరింది.


సాధార‌ణ ఎన్నిక‌ల‌కు యేడాది ముందు నుంచే యామిని టీడీపీ త‌ర‌పున మీడియాలో వాయిస్ బ‌లంగా వినిపించారు. కొన్ని కొన్ని సార్లు ఆమె వ్యాఖ్య‌లు మ‌రీ కాంట్ర‌వ‌ర్సీగా మార‌డంతో ఆమె విప‌క్ష పార్టీల‌కు చెందిన నేత‌ల‌కు కూడా బాగా టార్గెట్‌గా మారారు. ముఖ్యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై చేసిన వ్యాఖ్య‌ల త‌ర్వాత జ‌న‌సైనికులు ఆమెపై తీవ్రమైన ప‌ద‌జాలంతో విమ‌ర్శ‌లు చేశారు.


మీడియాలో టీడీపీ వాయిస్ వినిపించ‌డంతో పాటు సోష‌ల్ మీడియాలోనూ చంద్ర‌బాబును మ‌ళ్లీ గెలిపించాల‌ని విస్తృత ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత ఆమె సోషల్‌ మీడియాలో పోస్టులను తగ్గిస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు టీడీపీని వీడి బీజేపీలో చేరే ప్ర‌య‌త్నాల్లో ఉన్నార‌ని తెలుస్తోంది. ఏదేమైనా సాధినేని యామిని కూడా వెళ్లిపోతే ఆమె బాట‌లోనే మ‌రికొంద‌రు నేత‌లు కూడా వెళ్లే అవ‌కాశం ఉంద‌న్న ప్ర‌చారం కూడా టీడీపీ వ‌ర్గాల్లోనే జ‌రుగుతోంది.   


మరింత సమాచారం తెలుసుకోండి: