కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో వారం రోజులుగా పెను చర్చకు కారణమైన ఫోన్ ట్యాపింగ్పై సిబిఐ ద్వారా విచారణ జరిపించేందుకు బీజేపీ ప్రభుత్వం సిద్ధమైంది. కుమారస్వామి ముఖ్యమంత్రిగా కొనసాగిన తరుణంలో ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం ఆ తర్వాత వారు ముంబైలో మకాం వేసినవేళ వారితోపాటు బీజేపీ ఎమ్మెల్యేల ఫోన్లను ట్యాపింగ్ చేశారని ఆరోపణలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

 

ఢిల్లీ పర్యటన ముగించుకుని శనివారం అర్ధరాత్రి దాటాక బెంగళూరుకు చేరుకున్న సీఎం యడియూరప్ప ఆదివారం బాంబు పేల్చారు. ఫోన్ ట్యాపింగ్పై సిబిఐ విచారణకు ఆదేశిస్తున్నామన్నారు. మాజీ సీఎం సిద్దరామయ్యతోపాటు పలువురి ముఖ్యుల ఫోన్ల ట్యాపింగ్ను సీబీఐ ద్వారా తేల్చదలిచామన్నారు. వారం రోజులుగా బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఫోన్ ట్యాపింగ్పై పరస్పర ఆరోపణలు చేసుకున్నారు.

 

ఫోన్ ట్యాపింగ్ను కేవలం సిబిఐతో మాత్రమే కాదు.. అంతర్జాతీయ స్థాయిలోనూ విచారణలు జరుపుకోవచ్చునని చివరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ద్వారా కూడా తనిఖీ సంస్థలను ఏర్పాటు చేయించుకోవచ్చునని మాజీ సీఎం కుమారస్వామి ఎద్దేవా చేశారు. ధర్మస్థళలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నేను ఎటువంటి తప్పు చేయలేదని ఆత్మసాక్షిగా ముఖ్యమంత్రి హోదాలో వ్యవహరించానన్నారు.

 

అనుమానం ఉంటే సీబీఐ విచారణ జరుపుకోవచ్చునని సిద్దరామయ్యతోపాటు కాంగ్రెస్, జేడీఎస్ నేతలు డిమాండ్ చేశారు. యడియూరప్ప అందుకు సిద్ధం కావడంతో తొలుత కాంగ్రెస్ నేత సిద్దరామయ్య ఫోన్ ట్యాపింగ్పై సీబీఐ విచారణకు స్వాగతిస్తున్నట్టు ట్వీట్ చేశారు. కానీ కాంగ్రెస్ కొన్నేళ్ళుగా సీబీఐని కేంద్రప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తోంది.

 

జూన్‌, జూలై నెలల్లో ముఖ్యమంత్రి కుమారస్వామి కార్యాలయం నుంచే ట్యాపింగ్‌ వ్యవహారాలు సాగాయని కొందరు అధికారులు భాగస్వామ్యులయ్యారని ఏకంగా సీఎంఓ నుంచే బెదరింపులు వచ్చాయని ఆరోపించిన విషయం తెలిసిందే. పలువురు అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలతోపాటు బీజేపీ సీనియర్‌లు సీబీఐ విచారణపై సంతృప్తి వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: