క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే చట్టానికి ఎవరూ అతీతులు కాదన్న విషయం అర్ధమైపోతోంది. అధికారంలో ఉన్నపుడు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే, వ్యవస్ధలను నాశనం చేస్తే తర్వాతైన పరిహారం చెల్లించక తప్పదని దివంగత నేత ఇందిరాగాంధి విషయంలోనే రుజువైంది. సరే అదే కోవలో మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, జయలలిత లాంటి అనేకమంది విషయాల్లో కూడా రుజువైంది.

 

ఇంతకీ విషయం ఏమిటంటే కోడెల శివప్రసాదరావు పై కేసు నమోదైంది. అసెంబ్లీ స్పీకర్ గా ఉన్న కాలంలో ప్రభుత్వ ఆస్తులను సొంతానికి వాడుకున్నారనే అభియోగాలపై తుళ్ళూరు పోలీసులు కోడెలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సొంతానికి వాడుకోవటమంటే అధికారంలో ఉన్నపుడు మాత్రమే వాడుకోవటం కాదు.

 

పదవిలో నుండి దిగిపోయిన తర్వాత, అంతకుముందు ప్రభుత్వానికి వాపసు చేయాల్సిన ఏపి, ఫర్నీచర్ లాంటి చాలా ఆస్తులను తిరిగి ఇవ్వకుండా తన ఇంటికి తరలించారు. నిజానికి ఇంత కక్కుర్తి పడాల్సిన అవసరం సీనియర్ నేత కోడెలకు ఎంతమాత్రం లేదు. ఏదో మొదటిసారి ఎంఎల్ఏగా గెలిచి రెండోసారి ఓడిపోయిన నేతలు కక్కుర్తిపడితే ఏదోలే అనుకోవచ్చు. గడచిన 40 ఏళ్ళుగా ఎన్నో పదవులు అనుభవించిన కోడెల కూడా లేకిబుద్ధులు ప్రదర్శిస్తే ఎలా ?

 

తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొడుకు శివ రామకృష్ణ, కూతురు విజయలక్ష్మి నరసరావుపేట, సత్తెనపల్లిలో చేసిన అరాచకాలకు అంతే లేదు. ఇప్పటికే వీళ్ళద్దరిపైన సుమారు 20 కేసులు నమోదయ్యాయి. తమ కుటుంబంపై ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తు వేధిస్తోందంటూ కోడెల సొల్లు మాటలు మాట్లాడుతున్నారు.

 

ఏరోజుకారోజు కోడెల కుటుంబీకుల బాధితుల సంఖ్య పెరుగుతోందంటే కోడెల మాటలు ఎవరైనా నమ్ముతారా ? తాజాగా ప్రభుత్వ ఆస్తిని సొంతానికి వాడుకోవటంపై నమోదైన కేసు విషయంలో కోడెల ఏమి మాట్లాడుతారో చూడాలి. మొత్తానికి కోడెల కుటుంబానికి పార్టీ నుండి ఏ రకమైన మద్దతు దొరుకుతున్నట్లు కనిపించటం లేదు. ఎందుకంటే వేధింపుల్లో తన మన అని చూడకుండా పార్టీ నేతలను కూడా బాదేశారు కాబట్టే. ఏం చేస్తాం చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా.

 


మరింత సమాచారం తెలుసుకోండి: