పరిపాలనలో మరింత దూకుడుగా వెళ్ళాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. మ్యానిఫెస్టోలో చేసిన హామీలు, పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలు క్షేత్రస్ధాయిలో అమలయ్యే విధానాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని జగన్ నిర్ణయించారు. తన హామీల్లో ఇప్పటికే కొన్ని అమల్లోకి వచ్చిన వాటిని పర్యవేక్షించేందుకు జగన్ రచ్చబండ కార్యక్రమం మొదలుపెట్టబోతున్నారు.

 

అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల పాటు పూర్తిగా అధికారులతో సమీక్షా సమావేశాలకే పరిమితమైపోయారు. వివిధ శాఖలపై పట్టుసాధించటంలో భాగంగానే రోజుకు సుమారు 10 గంటలకుపైగా సమీక్షలు నిర్వహించారు. తర్వాత మంత్రివర్గ విస్తరణ చేసిన తర్వాత మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి సమావేశాలు నిర్వహించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అధికారాన్ని డీ సెంట్రలైజ్ చేశారు.

 

వివిధ శాఖలకు సంబంధించి తీసుకోవాల్సిన నిర్ణయాలను ఆయా మంత్రులు, ఉన్నతాధికారులకే వదిలేశారు. చంద్రబాబునాయుడు హయాంలో అయితే మొత్తం పవర్ ను తన చేతుల్లోనే ఉంచుకున్నారు. అయితే చంద్రబాబు లేకపోతే చినబాబు మాత్రమే నిర్ణయాలు తీసుకునే వారు.

 

గతంలో దివంగత నేత వైఎస్ కూడా రచ్చబండ కార్యక్రమానికి చిత్తూరుకు వెళుతున్నపుడే ప్రమాద వశాత్తు మరణించారు. కాబట్టి జగన్ కూడా అదే కార్యక్రమాన్ని చిత్తూరు నుండే పునఃప్రారంభించాలని డిసైడ్ అయ్యారని సమాచారం. కాబట్టి సెప్టెంబర్ నుండే రచ్చబండ కార్యక్రమం మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే సెప్టెంబర్ 1వ తేదీ నుండి రేషన్ కార్డులకు సన్నబియ్యం, ఫించన్లు డోర్ డెలవరీ మొదలవుతోంది.

 

ఇక అందరూ ఎదురుచూస్తున్న ఆరోగ్యశ్రీ పథకం కూడా సెప్టెంబర్ లోనే  పునఃప్రారంభం అవుతోంది. మొత్తం మీద అమల్లోకి వచ్చిన పథకాలు ప్రజలకు ఏ విధంగా చేరుతున్నాయో తెలుసుకోవటంతో పాటు అమల్లోకి రాబోతున్న పథకాలపై జనాభిప్రాయాలు తెలుసుకోవటం కూడా రచ్చబండ కార్యక్రమం ఉద్దేశ్యం. కాబట్టి సెప్టెంబర్ నుండి జగన్ పాలనలో మరింత దూకుడు ప్రదర్శించటం ఖాయమనే అనిపిస్తోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: