శ్రీశైలం దేవస్థానానికి చెందిన లలితాంబిక వాణిజ్య సముదాయంలోని దుకాణాల వేలం పాట ఎపిసోడ్ మ‌లుపులు తిరుగుతోంది. వేలం పాట‌ల్లో పాటదారుల మధ్య తలెత్తిన వివాదాలు, గొడవలు, అన్యమతస్తులకు వీటిని కేటాయిస్తున్నారన్న ఆరోపణలు సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. వివాదానికి కారణమైన శ్రీశైలం షాపింగ్ కాంప్లెక్సుల వేలాన్ని, టెండర్లను రద్దుచేస్తూ.. ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే, హిందూ సంస్థ‌లు ఇచ్చిన పిలుపుతో వివాదం నెల‌కొంది.


శ్రీశైలం ఆలయంలో దుకాణాల వేలంపాట వివాదంగా మారింది. షాపింగ్ కాంప్లెక్స్ వేలంలో అన్యమస్తులకు అవకాశం కల్పించారంటూ.. బీజేపీ, దాని అనుబంధ సంఘాల నాయకులు చేసిన ఆరోపణలు శ్రీశైలంలో వేడి పెంచాయి. ఆలయంలో అన్య మతస్థుల ప్రభావం ఎక్కువైందని వ్యాపారాలు నిర్వహించుకోవడానికి వారికే ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నారని బీజేపీతో పాటు పలు హిందూ సంఘాలు వేలంపాటను అడ్డుకున్నాయి. వేలం పాట సందర్భంగా వాగ్వాదంలో తోపులాటలు జరిగినప్పుడు కేవలం ఒక వర్గం వారి సీసీ కెమెరా విజువల్స్ బయటపెట్టి అభాసుపాలు చేయాలని చూస్తున్నారంటూ.. బీజేపీ నాయకులు మండిపడ్డారు. షాపుల వేలం పాటలో ముస్లింలు పాల్గొన్నారని అక్కడి బీజేపీ నేతలు వేలంపాటను అడ్డుకున్నారు. 


ఈ వివాదంలో ఎంటర్ అయ్యి ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఈ వివాదంపై స్పందించిన బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ మరో వర్గానికి షాపులను ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ఈ మేరకు ట్విటర్‌లో ఓ వీడియోను పోస్టు చేయడంతో పాటు శ్రీశైలాన్ని అన్యమతస్తుల నుండి రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ నేపధ్యంలో ఈఓ శ్రీరామచంద్రమూర్తిపై బదిలీ వేటు పడింది. ఆయన స్థానంలో కెఎస్.రామారావును ఈఓగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తనపై సోషల్ మీడియాలో ఆరోపణలను మాజీ ఈవో రామచంద్రమూర్తి తప్పుపట్టారు. కాగా, మంగళవారం చలో శ్రీశైలం ఆందోళనలకు పిలుపునివ్వడంతో.. పోలీసులు అలర్టయ్యారు. కొండ‌పైకి హిందూ సంస్థ‌లు చేరుకుంటుండటంతో పోలీసులు భ‌ద్ర‌త చ‌ర్య‌ల్లో భాగంగా వారిని నిలిపేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: