విజయవాడ శివారు ప్రాంతమైన కొత్తూరు తాడేపల్లిలో పది రోజుల క్రిందట దాదాపు 86 గోవులు మృతి చెందిన విషయం తెలిసిందే. భారీ సంఖ్యలో గోవులు మృతి చెందటం పట్ల కలెక్టర్ ఇంతియాజ్ విచారణ జరిపించాలని గతంలో ఆదేశించారు. గోశాలలో ఉండాల్సిన గోవుల కంటే ఎక్కువ సంఖ్యలో ఉండటం వలన గోవులు మృతి చెంది ఉంటాయని మొదట అంచనా వేసినా ఆ అంచనా నిజం కాదని తెలుస్తోంది. 
 
గతంలో ఇదే గోశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా 24 గోవులు చనిపోయాయి. గడువు ముగిసిన దాణాను గోవులకు పెట్టటం వలన 24 గోవులు అప్పుడు చనిపోయాయి. ప్రస్తుతం 86 గోవుల మృతికి సంబంధించిన ఒక ల్యాబ్ నివేదిక వచ్చింది. గోవులు తీసుకున్న మేతతోనే కడుపులో తేడా వచ్చినట్లు సమాచారం అందుతోంది. గన్నవరం వెటర్నరీ ల్యాబ్, ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి నివేదికలు ఇంకా రావాల్సి ఉంది. అన్ని నివేదికలు సరిపోల్చుకున్న తరువాత అధికారులు అధికారికంగా గోవుల మృతి కేసుకు సంబంధించిన విషయాలను వెల్లడిస్తారని సమాచారం. 
 
మొదటి నుంచి గోవులు తీసుకున్న మేత వలనే గోవులు మృతి చెందాయని పశు సంవర్ధక శాఖ అధికారులు అనుమానించారు. గోశాల నిర్వాహకులు కూడా మేత వలనే మరణించి ఉండే అవకాశం ఉన్నట్లుగా చెప్పారు. గోవులు తిన్న మేత ఎక్కడినుండి వచ్చిందనే విషయం గురించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. 15 రోజులు దాటకుండానే కోసుకొచ్చిన గడ్డి వలన ఈ ప్రమాదం జరిగిందా అనే విషయం కూడా విచారణలో తేలాల్సి ఉంది. 
 
గోశాలలో గోవుల మృతి కేసులో గోశాల నిర్వాహకుల నిర్లక్ష్యం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో 24 గోవులు చనిపోయిన సమయంలో గోశాల నిర్వాహకులపై, దాణా అందించిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మరి ఇప్పుడు 86 గోవుల మృతికి కారణమైన వారిపై అన్ని ల్యాబ్ నివేదికలు అందిన తరువాత పోలీసులు, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: