తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మ‌రో కీల‌క నిర్ణ‌యం దిశ‌గా క‌దులుతున్నారు. తాజాగా ప్రగతిభవన్‌లో కలెక్టర్ల సమావేశం నిర్వహిస్తున్నారు. కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనలో కలెక్టర్లను పాత్రధారులను చేయడం కోసం ఏర్పాటు చేసిన ఈ భేటీపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.  కొత్తగా అమల్లోకి వచ్చిన పంచాయతీరాజ్, పురపాలక చట్టాల అమలు విషయంలో కూడా అభిప్రాయాలను ఈ సమావేశంలో తీసుకోనున్నారు.  ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన‌ ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లతోపాటు మంత్రులు, సీఎస్, సంబంధితశాఖల కార్యదర్శులు పాల్గొన్నారు. 


కొత్త చట్టం రూపకల్పనతోపాటు, అమలులోకి వచ్చిన చట్టాల అమలు, 60 రోజుల ప్రత్యేక కార్యాచరణ అమలుపై జిల్లా కలెక్టర్లకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశనం చేయనున్నారు. లంచం ఇవ్వకుండా ప్రజలకు సత్వరం సేవలు అందేలా నూతన రెవెన్యూ చట్టం రూపొందాలన్న దృఢ నిశ్చయంతో ఉన్న సీఎం కేసీఆర్.. ఈ సమావేశంలో కలెక్టర్లందరి నుంచి అభిప్రాయాలు తీసుకుంటారు. వాటిని క్రోడీకరించి నూతన చట్టంలో పొందుపరిచే అవకాశం ఉంటుంది.పట్టణాలు, గ్రామాల అభివృద్ధికి నిర్దేశించిన 60 రోజుల ప్రణాళికపైనా సమావేశంలో చర్చిస్తారు.


భూ ప్రక్షాళన తర్వాత.. రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నాయనేది కలెక్టర్లకు ఒక అవగాహన వచ్చి ఉంటుందని భావిస్తున్నానని సీఎం చెప్పారు. అందుకే కొత్తచట్టంలో కలెక్టర్లను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించినట్టుగా కేసీఆర్ అధికారులతో చెప్పారు. క్షేత్రస్థాయిలో తమ అనుభవంలో ఉన్న విషయాలను, కొత్తచట్టం రూపకల్పనలో సూచనలను అందరు కలెక్టర్ల నుంచి తీసుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు అభిప్రాయాలు చెప్పటానికి, సూచనలు చేయటానికి, చర్చల్లో భాగస్వాములు కావటానికి సిద్ధమై రావాలంటూ కలెక్టర్లకు సర్క్యులర్లు జారీ అవ‌డంతో వారు స‌న్న‌ద్ద‌మై వ‌చ్చారు.  పల్లెలు, పట్టణాల్లో అమలుచేయబోయే 60 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికపై కూడా ఈ సందర్భంగా చర్చిస్తారు. ఈ మూడు విషయాలపై లోతైన చర్చ జరుగాల్సి ఉన్నందున ఈ సమావేశం రెండురోజులపాటు కొనసాగే అవకాశం ఉంద‌ని స‌మాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: