సెల్ ఫోన్లలో ఎక్కువగా ఉపయోగించే అప్లికేషన్లలో వాట్సాప్ ఒకటి. వాట్సాప్ ద్వారా మెసేజ్, వీడియో కాల్స్, ఆడియో కాల్స్, ఫోటోలు, వీడియోలు ఇతరులకు పంపటం, ముఖ్యమైన ఫైల్స్ ఇతరులకు పంపటం చేయవచ్చు. వాట్సాప్ వినియోగించే వినియోగదారులతో పాటు వాట్సాప్ గ్రూపుల సంఖ్య కూడా రోజు రోజుకు పెరిగిపోతుంది. వాట్సాప్ గ్రూపులను ఒకే మెసేజ్/ఆడియో/వీడియో ఒకే సమయంలో ఎక్కువ మందికి పంపటానికి ఉపయోగిస్తున్నారు. 
 
స్నేహితులు, ఒక ప్రాంతానికి చెందినవారు, ఒకే చోట కలిసి చదువుకున్న విద్యార్థులు, బంధువులు ఇలా ఎవరికి వారు వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేసుకుంటున్నారు. ప్రతి వాట్సాప్ గ్రూపుకు ఒకరు లేదా అంతకంటే ఎక్కువమంది అడ్మిన్స్ ఉంటారు. అడ్మిన్ కు ఎవరినైనా యాడ్ చేసే లేదా రిమూవ్ చేసే అధికారాలు ఉంటాయి. కానీ గడచిన కొన్ని రోజులుగా వాట్సాప్ లో పుకార్లు ఎక్కువగా పెరిగాయి. దోపిడీ దొంగల ముఠాలు, కిడ్నాప్ గ్యాంగులు తిరుగుతున్నాయని కొంతమంది, ఇతర దేశాల్లో ఎక్కడో జరిగిన హింసకు సంబంధించిన వీడియోలు కొంతమంది వాట్సాప్ లో పోస్ట్ చేస్తున్నారు. 
 
వీటిని నిజమని నమ్మి ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. వాట్సాప్ గ్రూపులలో పుకార్లు పెరిగి ప్రజా జీవితానికి భంగం కలిగించేలా ఉండటంతో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు ఒక హెచ్చరికను జారీ చేసారు. వాట్సాప్ గ్రూపులలో ఎవరైనా హింసకు సంబంధించిన వీడియోలను పెడితే వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లపై కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. హింసకు సంబంధించిన వీడియోలను పెట్టటం వలన శాంతి భద్రతలకు భంగం ఏర్పడే అవకాశం ఉందని కమిషనర్ అన్నారు. హైదరాబాద్ నగరంలో ఎన్నో ఇంటర్నేషనల్ కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయని అందువలన ఈ నగరంలో శాంతిభద్రతల కొరకు పటిష్టమైన చర్యలు తీసుకొంటున్నట్లు అంజనీకుమార్ తెలిపారు. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: