జులై 22 వ తేదీన శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుండి చంద్రయాన్ - 2 ను ప్రయోగించారు. ఇస్రో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తూ ప్రయోగించిన చంద్రయాన్ - 2 చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించింది. చంద్రయాన్ - 2 ప్రాజెక్ట్ లో కీలక ఘట్టం ఈరోజు జరిగింది. ఉదయం తొమ్మిది గంటల రెండు నిమిషాలకు మొదలైన ఈ ప్రక్రియ తొమ్మిది గంటల 20 నిమిషాల సమయంలో చంద్రుని కక్ష్యలో విజయవంతంగా అడుగుపెట్టటంతో పూర్తయింది. 
 
చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్ - 2 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టటంతో చంద్రయాన్ - 2 ప్రయోగంలో ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేసామని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఉపగ్రహంలోని లిక్విడ్ ఇంజిన్ ను మండించటం ద్వారా ఈ ప్రక్రియ జరిగింది. 29 రోజుల తరువాత చంద్రయాన్ - 2 ఈరోజు చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించింది. చంద్రుని కక్ష్యలోకి చేరటానికి 1740 సెకన్ల సమయం తీసుకున్నట్లు సమాచారం. 
 
సెప్టెంబర్ 2 వ తేదీన ల్యాండర్ పై రెండు ఆపరేషన్స్ జరగబోతున్నాయి. ఈ రెండు ఆపరేషన్స్ చేపట్టటం వలన సెప్టెంబర్ 7 వ తేదీన ల్యాండర్ సులువుగా ల్యాండ్ అవుతుంది. సెప్టెంబర్ 7 వ తేదీ రెండు గంటల నుండి రెండున్నర గంటల సమయంలో ల్యాండింగ్ అవుతుందని సమాచారం. ల్యాండర్ లో కెమెరాలు ఏర్పాటు చేసి ఉండటం వలన ఆ కెమెరాలు ల్యాండింగ్ ప్రాంతాన్ని రియల్ టైమ్ ఫోటోలు తీసి కిందకు పంపుతాయి. 
 
ఎలాంటి సమస్యలు లేకుండా ఉండే స్థలాన్ని ఎంపిక చెసి ల్యాండర్ కింద కెమెరాలు ల్యాండ్ చేస్తాయి. ల్యాండర్ ల్యాండ్ అయిన నాలుగు గంటల సమయం తరువాత సెకనుకు సెంటీమీటర్ వేగంతో ప్రయాణించే ఆరు చక్రాల రోవర్ బయటకు వస్తుంది. ఈ ఆరు చక్రాల రోవర్ 14 రోజుల సమయంలో దాదాపు 500 మీటర్ల దూరం చంద్రునిపై ప్రయాణిస్తుంది. అక్కడ తీసిన డేటా 15 నుండి 20 నిమిషాల సమయంలో ల్యాండర్ సహాయంతో భూమిని చేరుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: