విజయవాడ లో వచ్చిన కృష్ణా వరదలు సహజమైనవి కావా? అంటే అవుననే  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటున్నారు.  తాను నివాసం ఉంటున్న ఇంటిని ముంచేందుకే  వైకాపా నేతలు కృత్రిమ వరదను సృష్టించారని అన్నారు . తన ఇంటిని ముంచాలనుకుని,  ప్రజల ఇళ్లను కూడా ముంచారని ఆయన విమర్శించారు.  వరద నీటితో ప్రాజెక్టులను  నింపకుండా, రాష్ట్ర ప్రభుత్వం  జనావాసాలను నింపిందని  విరుచుకుపడ్డారు. మంత్రులు తన ఇంటి చుట్టూ హడావుడి చేశారే తప్పితే ప్రజల బాగోగులు పట్టించుకోలేదని ఆరోపించారు .


 కరకట్ట రక్షణ గోడ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలన్న చంద్రబాబు... వరద బాధితుల అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత పదేళ్ల లో ఎప్పుడు లేనివిధంగా కృష్ణా నదికి వరదలు వచ్చిన విషయం తెల్సిందే . ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాల కారణంగా కృష్ణానది ఉప్పొంగి ప్రవహించింది . దీనితో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోగా , దిగువకు నీటిని విడుదల చేసిన విషయం తెల్సిందే . వరద ప్రవాహం తీవ్రంగా ఉండడం తో నాగార్జున సాగర్ లో పూర్తి స్థాయి నీటి మట్టం చేరగానే , దిగువ ప్రకాశం బ్యారేజ్ కు అధికారులు  నీటిని విడుదల చేశారు .


అయితే ప్రకాశం బ్యారేజ్ నుంచి నీటి విడుదల లో జాప్యం చేయడం వల్లే కరకట్ట చుట్టూ నిర్మించిన ఇల్లు నీటమునగడం తో పాటు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయని చంద్రబాబు అంటున్నారు .  చంద్రబాబు విమర్శలపై వైకాపా నేతలు ధీటుగా స్పందిస్తున్నారు. కరకట్ట ప్రాంతం లో నిర్మించిన అక్రమ నిర్మాణం లో నివసిస్తున్న చంద్రబాబు , కృష్ణానది కి వచ్చిన వరదలు కృత్రిమమైనవని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేస్తున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: