ఉమ్మడి రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన పార్టీ రాష్ట్ర విభజన తర్వాత రోజురోజుకు పరిస్థితి దిగజారుతుంది. పార్టీలోని నాయకులంతా కండువాలు మార్చేస్తున్నారు. మొదట్లో అంతా కారెక్కి వెళ్లిపోతే ఈ సారి కమలంతో కమిట్ అవుతున్నారు. కొంత మంది నాయకులు తప్ప తెలంగాణ టిడిపి మొత్తం ఖాళీ అయిపోయిందని చెప్పాలి. ఇంతకీ మిగిలిన నాయకులైన చివరిదాక ఉంటారా చాన్స్ వస్తే వాళ్లు కూడా జంప్ చేస్తారా అనే ప్రశ్న ఓ వైపు ఉంటే అసలు టీటీడీపీలో మిగిలిన నాయకులెవరూ అనే ఆసక్తి నెలకొంది. తెలంగాణలో టిడిపి ఇతర పార్టీలకు కావలసిందిగా మారిపోయింది. అంటే టిడిపి బాగుపడాలని కాదు ఆ పార్టీ నేతలను గుంజుకుని తమ పార్టీలను బలోపేతం చేసుకోవటానికి ఎడాపెడా వాడేసుకుంటున్నారు.


మొన్నటి వరకూ సైకిల్ పార్టీ నాయకులంతా కారెక్కి గులాబీ కండువా కప్పుకుంటే ఇప్పుడు కమలం పార్టీలోకి వెళ్ళిపోయారు. మిగిలిన నాయకుల్లో సైతం కొంత మంది ఎవరిదారివారు చూసుకుంటున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పదమూడు స్థానాల్లో మాత్రమే పోటీ చేసి చాలా మంది నాయకులను పార్టీ దూరం చేసుకుంది. ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో అసలు పోటీనే చేయలేదు. దాంతో బ్యాలెట్ బాక్స్ పై పార్టీ పుట్టాక మొదటిసారి సైకిల్ కనుమరుగయ్యింది. కొనసాగింపుగా ఇప్పుడు తెలంగాణలో టిడిపికి నాయకులే కరువయ్యారు. తెలంగాణ ఉద్యమం ఇక్కడి రాజకీయ పార్టీలను కకావికలం చేసిందని చెప్పాలి. మలి దశ ఉద్యమం ఆరంభమైన నాటి నుండే చంద్రబాబు వైఖరితో తెలంగాణలో టిడిపి పార్టీ పతనం మొదలైంది.


రాష్ట్ర అవతరణతో టిడిపి పరిస్థితి మరింత దిగజారింది. ఇప్పుడు గులాబీ పార్టీలో చేరడానికి ఇష్టంలేని నేతలందరూ కాషాయం కండువా కప్పుకునేందుకు సై అంటున్నారు. దీంతో తెలంగాణలో టీడీపీ దాదాపు ఖాళీ అయిందనే పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి హైదరాబాద్ లోని టిడిపి కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఎప్పుడూ హడావుడి ఉండేది. ఇప్పుడు అక్కడ ఆఫీసు స్టాఫ్ కంటే తక్కువ సంఖ్యలో నాయకులు వస్తున్నారు. ఆ పార్టీలోకి ఈ పార్టీలోకి పోను పార్టీలో అధ్యక్షుడు పోలిట్ బ్యూరో సభ్యులు ఇలా గట్టి నాయకులు పది పదిహేను మంది మిగిలారు. వాళ్లు సైతం ఏం చేయాలో అర్థం కాక తికమక పడుతున్నారు. టీడీపీ తెలంగాణ అధ్యక్షుడుగా ఎల్ రమణ కొనసాగుతున్నారు.

ఎంపి గా, ఎమ్మెల్యే గా పని చేసిన రావుల చంద్రశేఖర్ రెడ్డి పోలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నారు. ఎన్టీఆర్ బాబులకు వీరాభిమానిగా తాను పార్టీలోనే ఉంటానంటున్నారు. ఇక మరో పోలిట్ బ్యూరో సభ్యులు దేవేందర్ గౌడ్ ఇప్పటికే గౌడ్ తో బీజేపీ చర్చలు జరుపుతుంది. తన వారసుల భవిష్యత్తు కోసమైనా పార్టీ మారే అవకాశముందని టాక్ ఉంది. ఇక టిడిపి జాతీయ అధికార ప్రతినిధులుగా కొత్తకోట దయాకర్ రెడ్డి, అరవింద్ కుమార్ లు ఉన్నారు. మరో పక్క మొన్నటి ఎన్నికల్లో టిడిపి రెండు అసెంబ్లీ స్థానాల్లో గెలవగా మిగిలింది అశ్వరావుపేట ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరావు. ఈయన గెలిచిన నాటి నుంచే ఇతర పార్టీల నుంచి ఆహ్వానాలు వచ్చాయి. కానీ తన జీవితం టీడీపీకే అంకితం అంటున్నారు.


ఇక టిడిపిలో మరో ముఖ్యమైన నేత పోలిట్ బ్యూరో సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి సైతం భవిష్యత్తు ఉన్న పార్టీలోకి వెళ్లాలని ఆలోచిస్తున్నారట. ఇప్పటికే బిజెపితో చర్చలు కూడా జరుగుతున్నాయని టాక్ ఉంది. వాస్తవానికి తెలంగాణలో టిడిపిని పట్టించుకునే వారెవరు లేనట్టుగా తయారయ్యింది. ఎన్నికల్లో పోటీ చేయరు నాయకత్వం సీరియస్ గా లేదు. పార్టీ ప్రధాన కార్యదర్శి స్థానంలో ఉండి తెలంగాణ పార్టీ కార్యాలయ వ్యవహారాలు చూసిన బుచ్చి లింగం ఈ మధ్య ఆకస్మాత్తుగా గుండె పోటుతో చనిపోయారు. ఇప్పటికీ పార్టీ కార్యాలయ ఇన్ చార్జి నియామకం కూడా కాలేదంటే టిడిపి పరిస్థితి ఎలా ఉందో అర్ధమౌతుంది.అటు వరంగల్ జిల్లాలో రేవూరి మినహా టీడీపీ దాదాపు ఖాళీ అయ్యింది. చెప్పుకోదగ్గ నేతలెవ్వరూ టిడిపిలో ఇప్పుడు లేరు. దీంతో రాజకీయ భవిష్యత్తు కోసం కింది స్థాయి కేడర్ మొత్తం వేరే పార్టీలోకి క్యూ కడుతున్నారు. ఒకప్పుడు ఓరుగల్లులో కళకళలాడింది టి


డిపి. టిడిపిలో కీలక నేతలైన కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకరరావు, సిరికొండ మధుసూదనాచారి, అజ్మీరా లాంటి సీనియర్ లు ఒక్కొక్కరుగా పార్టీని వీడారు. దీంతో కొందరు నేతలు టిడిపిలోనే ఉండి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.


ఎంతమంది టిడిపిని వీడిన పెద్దగా పట్టించుకోని కింది స్థాయి నేతలు, చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడైన రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావు టిడిపిని వీడి బీజేపీ కండువా కప్పుకుంటుండడంతో పార్టీ కేడర్ పై ప్రభావం పడింది. గరికపాటి మోహన్ రావు ఆధ్వర్యంలో పలువురు స్థానిక నేతలు కూడా బీజేపీలో చేరారు. మిగిలిన ఒకరిద్దరు నేతలు కూడా తరువాత బీజేపీలో చేరతారని ప్రచారం సాగుతుంది. రేవూరి ప్రకాష్ రెడ్డి సైతం కాషాయం నీడలో చేరుతారు అనే ప్రచారంలో వరంగల్ జిల్లాలోని కాదు తెలంగాణ అంతటా ఇదే పరిస్థితి. సీనియర్లు కండువా మార్చేశారు. మిగిలిన ఒకరిద్దరు కూడా పార్టీ మారడానికి రెడీగా ఉన్నారు. దీంతో తెలంగాణలో టీడీపీ ఖాళీ అయిందని చర్చ నడుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: