వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే...మద్యపాన నిషేధం దశలవారీగా అమలు చేస్తామని ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచి కొత్త పాలసీ అమలులోకి రానుంది. ఇప్పటికే మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. ఐతే.. అందరిలో ఒకటే డౌట్‌. ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మద్యాన్ని దశలవారీగా నిషేధిస్తే... ఆదాయం ఎలా..? ఒక్కొక్కరు ఒక్కో విధంగా విశ్లేషించారు. సాధ్యం కాదంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. కానీ సర్కార్‌ మాత్రం పక్కా ప్లానింగ్‌లో ఉంది. ఆదాయం ఎలా రాబట్టాలో ఐడియాకు వచ్చిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కన్పిస్తోంది. ప్రస్తుతం ఎక్సైజ్‌ శాఖ.. ఆర్థిక శాఖల్లో జరుగుతున్న కసరత్తు.. ఆ రెండు శాఖలకు సంబంధించిన అధికారులు వేసుకుంటున్న లెక్కలు.. అంచనాలు చూస్తుంటే.. మద్య నిషేధం అమలు విషయంలో ప్రభుత్వం చాలా చాకచక్యంగా వ్యవహరించినట్టుగా కన్పిస్తోంది.


మద్యపాన నిషేధంలో భాగంగా 20శాతం షాపులను జగన్ సర్కార్ కుదిస్తోంది. దుకాణాల సంఖ్య తగ్గినా... ఆదాయం పడి పోకుండా మద్యం ధరలు పెంచి ఆదాయాన్ని ఆర్జించే పనిలో ఉంది. ప్రస్తుతం ఉన్న 4,380 దుకాణాలకుగాను 3500 దుకాణాల్లోనే మద్యం విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మద్యం షాపులను నిర్వహించబోతోంది సర్కార్‌. ప్రస్తుతం దుకాణాలకు అనుబంధంగా ఉన్న పర్మిట్ రూములను రద్దు చేయనున్నారు. దీంతో ఎక్సైజ్ ఆదాయం తగ్గుతుందని అంతా అనుకున్నారు. కానీ ఇక్కడే ప్రభుత్వం అదిరిపోయే ప్లాన్‌ వేసింది. మద్యం ధరల పెంపుతో పాటు అమ్మకాలపై పన్నులను పెంచాలని డిసైడయ్యింది. దీని ద్వారా గతేడాదితో పోలిస్తే సుమారు రూ.5వేల కోట్ల ఆదాయాన్ని అదనంగా పొందాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.


ప్రస్తుతం ఉన్న మద్యం ధరల కంటే 10 శాతం పెంచే యోచనలో ఉంది ప్రభుత్వం. దీంతో చీఫ్ లిక్కర్ ధరలకు రెక్కలు రానున్నాయి. ప్రభుత్వం ఒక్కో బాటిల్ పై రూపాయి నుంచి రెండు రూపాయలు పెంచినా అది రౌండాఫ్ పద్ధతిలో 10 రూపాయలుగా వసూలు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు వంద రూపాయల బాటిల్ ధరను రెండు రూపాయలు పెంచితే 102 రూపాయలు కావల్సిన బాటల్ ధర 110 గా రౌండాఫ్ చేస్తారు. గత మూడేళ్ళుగా ఈ రౌండాఫ్ విధానం రాష్ట్రంలో అమల్లో ఉంది. ఎక్సైజ్‌శాఖ నుంచి గతేడాది 6, 220కోట్ల రూపాయల ఆదాయం రాగా... ఈ ఆర్థిక సంవత్సరం 2,297 కోట్ల రూపాయల మేర అదనపు ఆదాయం లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. దీంతో మొత్తంగా 8వేల 517 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందనేది ప్రభుత్వ అంచనా. ఇక ఎక్సైజ్ ఆదాయంలో ఎక్సైజ్ డ్యూటీదే అగ్రభాగం. తర్వాత మద్యం అమ్మకాలపై విధించే వ్యాట్‌దే రెండో స్థానం. మద్యం ధరల పెంపునకు తోడు వ్యాట్ పెరుగుదలతో 5 వేల కోట్ల రూపాయల ఆదాయం అదనంగా వచ్చే అవకాశం ఉంది. మద్యం మహమ్మారిని కుటుంబాల నుంచి తరిమే ప్రయత్నంలో.. ఆదాయ పెంపును మరిచిపోలేదు ప్రభుత్వం. ఐతే.. మద్యం ధరల పెంపుపై ప్రజల నుంచి ఎలాంటి రియాక్షన్‌ వచ్చినా ముందుకెళ్లాలని డిసైడయ్యింది ప్రభుత్వం. 



మరింత సమాచారం తెలుసుకోండి: