ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కేంద్రంగా ఆంద్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త చ‌ర్చ మొద‌లైంది. ఏపీ రాజధాని అమ‌రావ‌తి గురించి ప్రభుత్వంలో చర్చ జరుగుతోందని, త్వరలోనే దీనిపై కీలక నిర్ణయం ప్రకటించబోతున్నామని ఆయ‌న ప్ర‌క‌ట‌న చేసిన సంగ‌తి తెలిసిందే. బొత్స వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.. రాజధానిపై బొత్స నోటి నుంచి వచ్చిన మాట.. సీఎం వైఎస్ జగన్ చెబితేనే వచ్చిందా..? అని ప్రశ్నించారు. 


విశాఖ‌ప‌ట్ట‌ణంలో బొత్సా మీడియాతో మాట్లాడుతూ, అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడంలో సమస్యలు ఉన్నాయని, ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని మరికొన్ని రోజుల్లో కీలక నిర్ణయం ప్రకటిస్తున్నామని చెప్పారు. ప్రస్తుత రాజధాని అమరావతిలో సాధారణ వ్యయం కంటే నిర్మాణ వ్యయమే మోయలేనంత భారంగా మారుతోందని అన్నారు. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడంలో ప్రజాధనం విపరీతంగా దుర్వినియోగం అవుతోందని తెలిపారు. గత కొన్నిరోజులుగా వరదలు రావడంతో రాజధానిలో ముంపుకు గురయ్యే ప్రాంతాలు పెద్ద సంఖ్యలో ఉన్నట్టు తేలిందని, ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఎక్కడిక్కడ కాలువలు, డ్యామ్ లు నిర్మించాల్సి ఉంటుందని, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని ఇదేమంత అంత సులభమైన వ్యవహారం కాదని బొత్స స్పష్టం చేశారు.


కాగా, బుద్ధా వెంక‌న్న మీడియాతో మాట్లాడుతూ...మంత్రి బొత్స మాటలతో రాజధాని కొలాప్స్ అయ్యిందని బుద్దా వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానిపై తన అభిప్రాయాన్ని సీఎం వైఎస్ జగన్ వెంటనే వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు మేం చెప్పిన మాటలు నిజమని జగన్ తన చర్యల ద్వారా నిరూపిస్తున్నారని.. అన్న క్యాంటీన్లు మూసేశారు. సంక్షేమ పథకాలు ఆపేశారు.. పోలవరం నిలిపేశారు.. ఇప్పుడు రాజధాని సేఫ్ కాదంటున్నారని మండిపడ్డారు. రాజధానిని ముంపు నుంచి కాపాడేందుకు మేం లిఫ్ట్ పెడితే.. ఆ లిఫ్టునే వినియోగించే ప్రభుత్వం రాజధానిని ముంచేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: