సామాన్యుల‌కు పెద్ద ఊర‌ట‌. ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించేందుకు నెట్‌వర్క్ దవాఖానల యాజమాన్యాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి. సమస్యలు పరిష్కరిస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల వారికి హామీఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి. దీంతో వైద్య‌సేవ‌లు అంద‌కుండా దాదాపు వారం రోజులుగా ఇబ్బంది ప‌డుతున్న రోగుల‌కు ఉప‌శ‌మ‌నం దొరికిన‌ట్ల‌యింది.


స‌చివాల‌యంలో జ‌రిగిన చ‌ర్చ‌ల్లో ఇప్పటివరకు ఉన్న పెండింగ్ బకాయిలను చెల్లించేందుకు అంగీకరించారు. ప్రతినెలా ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. మంత్రి హామీపై సంతృప్తిచెందిన దవాఖానల యాజమాన్యాలు సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించాయి. చర్చల అనంతరం మంత్రి ఈటల మాట్లాడుతూ.. ప్రతినెలా విడుదల కావాల్సిన చెల్లింపులు ఆలస్యమవడంతో చిన్న దవాఖానలకు ఇబ్బంది కలుగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు రూ.520 కోట్లు విడుతలవారీగా విడుదల చేసినట్టు తెలిపారు. రాబోయేకాలంలో ప్రతినెలా కొంత మొత్తం చెల్లించాలని దవాఖానల యాజమాన్యాలు కోరాయని, తప్పకుండా అమలుచేస్తామని భరోసా ఇచ్చారు. 2007-12 మధ్యకాలంలోని ఎంవోయూలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నదని, తప్పకుండా పరిశీలిస్తామని స్పష్టంచేశారు.  రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ గొప్పగా అమలవుతున్నదని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా లక్షల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ వర్తిస్తున్నదని చెప్పారు. . ఆయుష్మాన్‌భారత్ కన్నా ఆరోగ్యశ్రీ పథకం వందరెట్లు గొప్పదని తెలిపారు. ఆయుష్మాన్‌భారత్ కేవలం 25 లక్షల కుటుంబాలకే వర్తించే అవకాశం ఉన్నదని, ఆరోగ్యశ్రీతో 85 లక్షల కుటుంబాలకు సేవలు అందుతున్నాయని వివరించారు.


తక్షణమే సమ్మె విరమిస్తున్నామ‌ని నెట్‌వ‌ర్క్ ఆస్ప‌త్రుల ప్ర‌తినిధులు ప్ర‌క‌టించారు. సమస్యలను ఓపికగా విని, పరిష్కరించేందుకు ముందుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.  ఆయుష్మాన్‌భారత్ కంటే ఆరోగ్యశ్రీ మంచి పథకమని తెలిపారు. ఆరోగ్యశ్రీతో రాష్ట్రంలో మూడున్నరకోట్ల మంది లబ్ధి పొందుతున్నారని, మాకు ఆయుష్మాన్‌భారత్ వద్దు ఆరోగ్యశ్రీనే కావాలని చెప్పామ‌ని పేర్కొన్నారు. చిన్న ఆస్ప‌త్రుల‌ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంద‌ని కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: