కర్నాటక ముఖ్యమంత్రి యడుయూరప్ప ఇలా మంత్రివర్గాన్ని ఏర్పాటు  చేశారో లేదో వెంటనే అసమ్మతి మొదలైంది. సీనియర్ ఎంఎల్ఏలను, అవసరానికి మద్దతు పలికిన ఎంఎల్ఏలను కాదని యడ్డి ఇతరులకు మంత్రివర్గంలో చోటు కల్పించారట. దాంతో చాలామంది సీనియర్లు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. యడ్డీపై అసమ్మతితో మండిపోతున్న వారి సంఖ్య కనీసం 10 వరకూ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

 

మంత్రివర్గ ఏర్పాటు తర్వాత ఎంఎల్ఏల్లో అసమ్మతి మొదలవ్వటం ఖాయమని ఎప్పటి నుండో అనుకుంటున్నదే. ఆ కారణంగానే యడ్డీ కూడా దాదాపు 20 రోజులుగా మంత్రివర్గం ఏర్పాటు ఊసే ఎత్తకుండా నెట్టుకొచ్చారు. అయితే అలా ఎక్కువ రోజులు నెట్టుకురాలేరు కదా ? అందుకనే ఢిల్లీ నాయకత్వంతో చర్చలు జరిపి మొత్తానికి 15 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. అదే ఇపుడు యడుయూరప్ప కొంపమీదకు తెచ్చేట్లుగా ఉంది.

 

పూర్తిగా బిజెపి ఎంఎల్ఏలతోనే మంత్రివర్గ ఏర్పాటు జరిగినా సీనియర్లైన ఉమేష్ కుట్టి, మురుగేష్ నిరాని, బాలచంద్ర జార్కిహోలి, రేణుకాచార్య, బసవరాజు పాటిల్ యత్నాల్ లాంటి కొందరు కార్యక్రమానికి దూరంగా ఉండిపోయారు. కార్యక్రమానికి గైర్హాజరవ్వటంతోనే తమ మనసులో ఏముందో చెప్పేశారు సీనియర్లు.  అలాగే మంత్రివర్గంలోని సభ్యులను చూసిన తర్వాత తనకు ఆశ్చర్యం, బాధ వేసిందని చిత్రదుర్గ ఎంఎల్ఏ తిప్పారెడ్డి బాహాటంగానే  మండిపోయారు.

 

అదే సమయంలో తనకు మంత్రిపదవి రాకపోవటాన్ని మరో సీనియర్ ఎంఎల్ఏ ఎస్ అంగర మండిపోతున్నారు. బిజెపిలో విలువలు పాటించే వాళ్ళకు ప్రాధాన్యత లేదన్న విషయం  మంత్రివర్గం ఏర్పాటుతో తేలిపోయిందన్నారు.  ఎనిమిదిసార్లు ఎంఎల్ఏగా గెలిచిన ఉమేష్ కుట్టి, బసవరాజు పాటిల్ , తిప్పారెడ్డి అంగర లాంటి వాళ్ళు తొందరలోనే ఢిల్లీ పర్యటన పెట్టుకున్నట్లు సమాచారం. యడ్డికి వ్యతిరేకంగా పావులు కదపటానికి వీళ్ళంతా తొందరలోనే ఓ బృందంగా ఏర్పడి ఢిల్లీ నాయకత్వంతో భేటీకి రెడీ అవుతున్నారట. క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే యడ్డీ ప్రభుత్వం కూడా ఎన్నో రోజులు ఉండేట్లుగా కనబడటం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: