తిరుమలలో దళారులపై తిరుమల తిరుపతి దేవస్థానం ఉక్కుపాదం మోపుతోంది. పీఆర్వోల ముసుగులో అక్రమాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అధికారులను స్పెషల్ ఆఫీసర్ ధర్మారెడ్డి ఆదేశించారు. ప్రజప్రతినిధుల సిఫారసు లేఖలపై టికెట్లు పొంది అక్రమాలకు పాల్పడుతున్న పీఆర్వోలపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టనున్నారు. దీనిపై పోలీస్ విచారణ కూడా జరుపుతున్నట్లు సమాచారం అందుతోంది. 
 
శ్రీ వారి బ్రేక్ దర్శనాలలో అక్రమ దందాలు చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతామని టీటీడీ పాలకమండలి ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి స్పెషల్ ఆఫీసర్ ధర్మారెడ్డి ఇద్దరూ చెప్పారు. ఈ దిశగా ఇప్పటికే చర్యలు ప్రారంభమైనట్లు తెలుస్తుంది. వై వీ సుబ్బారెడ్డి కార్యాలయంలో ఉన్న సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారని స్వయంగా చైర్మన్ ఫిర్యాదు చేయటంతో అక్రమాలు చేస్తున్న వారిని గుర్తించి వారిపై బదిలీ వేటు వేసినట్లు తెలుస్తోంది. 
 
పీఆర్వోల ముసుగులో దళారులుగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవటంతో పాటు టికెట్ల జారీ ప్రక్రియలో సమగ్ర మార్పులు తీసుకువస్తున్నట్లు తెలుస్తుంది. గత నెల రోజులలో టికెట్ల జారీకి సంబంధించిన ప్రక్రియను పరిశీలిస్తున్నట్లు సమాచారం అందుతుంది.  
 
వీఐపీ బ్రేక్ దర్శనానికి సంబంధించిన ప్రతి ఒక్కరినీ నిన్న తనిఖీలు చేసినట్లు తెలుస్తోంది. 15 మంది పీఆర్వోలు అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారని సమాచారం. ఈ సమాచారం మొత్తాన్ని కూడా పోలీస్ అధికారులకు నివేదికలిచ్చినట్లు తెలుస్తుంది. దీనిపై దర్యాప్తు ప్రస్తుతం కొనసాగుతుందని తెలుస్తుంది. 
 
తిరుమలలో గతంలో వీఐపీ టికెట్ల కేటాయింపులు, లక్కీ డిప్ టికెట్ల విషయంలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. అప్పుడు టీటీడీ విజిలెన్స్ విభాగం చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ తిరుమలలో దళారుల అక్రమాలు మాత్రం ఆగటం లేదు. మరి విజిలెన్స్ అధికారులు ఇప్పుడు తీసుకోబోయే చర్యలతోనైనా తిరుమలలో పీఆర్వోల ముసుగులో  దళారులు చేస్తున్న అక్రమాలు ఆగుతాయేమో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: