ఉత్తర భారత దేశంలో బీజేపీ బలంగా పాతుకుపోయింది.  హిందుత్వవాదంతో పాటు.. సుస్థిర పాలన, దేశరక్షణ, అభివృద్ధి అజెండాతో ప్రజల్లోకి వెళ్ళింది.  అలా వెళ్లిన ప్రతి రాష్ట్రంలోనూ సక్సెస్ అయ్యింది.  కాగా, ఉత్తరాదికి.. దక్షిణాదికి మధ్య చాలా తేడా ఉంది.  ఉత్తరాదిన ఉండే రాజకీయ అంశాలు వేరు.. దక్షిణాదిన ఉండే ఓటర్ల మనస్తత్వాలు వేరు.  దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక మినహా.. ప్రాంతీయ పార్టీల హవా ఎక్కువగా ఉంటుంది.  ప్రాంతీయ పార్టీలవైపు ప్రజలు మొగ్గు చూపుతారు.  


దీంతోపాటు కుల రాజకీయాలు ఎక్కువ.  జాతీయవాదం కంటే.. కులాల సమీకరణపైనే ఎక్కువ ఆధారపడి ఉంటుంది.  ఈ సామాజిక వర్గాలపై  ఎవరైతే పట్టు సాధిస్తారో వారికే ఓటుబ్యాంకు ఉంటుంది.  అయితే, 2014 తరువాత తెలంగాణాలో సెంటిమెంట్ వర్కౌట్ అయ్యింది. తెలంగాణా సెంటిమెంట్ తోనే కెసిఆర్ రెండుసార్లు విజయం సాధించారు.  ఇకపై ఆ సెంటిమెంట్ వర్కౌట్ కాకపోవచ్చు.  ఎందుకంటే ప్రజలు రెండుసార్లు సెంటిమెంట్ వైపు మొగ్గుచూపినా.. పాలనా విషయంలో ఎలాంటి మార్పులు వచ్చాయి అన్నది ముఖ్యం.  


ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలను చూసుకుంటున్నారా లేదా అన్నది ముఖ్యం.  ఉద్యోగాల కల్పన ఎంతవరకు ఉన్నది.. విద్య ఆరోగ్యం విషయంలో ఎలాంటి పురోగతి ఉన్నది అన్నది ప్రజలు గమనిస్తున్నారు.  గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణాలో తెరాస పార్టీకి తగిన మెజారిటీ ఇవ్వలేదు.  కేవలం 9 చోట్ల మాత్రమే విజయం సాధించింది.  బీజేపీ 4 చోట్ల విజయం సాధించింది.  ఇది ఆ పార్టీకి మంచి బూస్ట్ ఇచ్చినట్లయింది.  ఇప్పటినుంచే కృషి చేస్తే తెలంగాణాలో పాగా వెయ్యొచ్చు అనే ధీమా వచ్చింది.  


అందుకే మిషన్ 2023 ని ప్లాన్ చేసింది.  ఏ పార్టీకైనా గ్రామస్థాయిలో కార్యకర్తలు బలంగా ఉండాలి.  క్రియాశీల రాజకీయాల్లో కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలి.  అప్పుడే పార్టీ విజయం సాధించే అవకాశం ఉన్నది.  అంతేకాదు.. పార్టీ తీసుకోబోతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలి అంటే.. అది కార్యకర్తల ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది.  అందుకే రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తల నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. దాదాపు 12 లక్షల మంది కొత్తగా బీజేపీలో జాయిన్ అయ్యారు.  జాతీయ నాయకుల చూపులు తెలంగాణ వైపు ఉన్నాయి.  నిత్యం ఎవరో ఒకరు తెలంగాణాకు వెళ్లాలని.. అక్కడి కార్యకర్తలు, నాయకులతో మమేకం కావాలని నిర్ణయం తీసుకున్నారు.  అన్ని అనుకున్నట్టుగా జరిగితే.. వచ్చే 2023 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ పాగా వేస్తుంది అనడంలో సందేహం అవసరం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: